డబుల్ ఇంజిన్ సర్కారుతోనే తెలంగాణ అభివృద్ధి సాధ్యం - పవన్ కల్యాణ్
X
డబుల్ ఇంజిన్ సర్కారుతోనే తెలంగాణ అభివృద్ధి సాధ్యమని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. కూకట్ పల్లి జనసేన పార్టీ అభ్యర్థి ప్రేమ్ కుమార్ కు మద్దతుగా ఆయన ప్రచారం నిర్వహించారు. తెలంగాణ వస్తే ఉద్యోగాలు వస్తాయని యువత ఆశపడ్డారని, కానీ వారి ఆశలు అడియాశలయ్యాయని అన్నారు. జనసేన ఆవిర్భావం తెలంగాణలోనే జరిగిందని, అందుకే ఇక్కడ బీజేపీతో కలిసి పోటీ చేస్తున్నామని పవన్ స్పష్టం చేశారు.
ఉత్తరాంధ్రకు చెందిన పలువురు తెలంగాణను మాతృభూమిగా చేసుకుని జీవనం సాగిస్తున్నారని పవన్ అన్నారు. ఉత్తరాంధ్రకు చెందిన 26 వెనుకబడిన కులాలను బీసీ జాబితా నుంచి తీసేశారని, బీజేపీ, జనసేన కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే వారికి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. జనసేనకు మద్దతు తెలిపేందుకు సభకు వచ్చిన తెదేపా కార్యకర్తలకు పవన్ కల్యాణ్ కృతజ్ఞతలు చెప్పారు.
ఇదిలా ఉంటే కూకట్‌పల్లిలో నిర్వహించిన బీజేపీ - జనసేన సభ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. సభా వేదిక వద్ద ఏర్పాటు చేసిన బారికేడ్లను తోసుకుంటూ కార్యకర్తలు ముందుకు దూసుకొచ్చారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు లాఠీఛార్జి చేసి జనాన్ని అదుపు చేశారు. ఈ క్రమంలో పోలీసులు, జనసేన కార్యకర్తల మధ్య వాగ్వాదం జరిగింది.