తెలంగాణ ఫలితాలు.. ఏపీలో బెట్టింగ్
X
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ పూర్తయింది. రేపు వెలువడే ఫలితాలపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. కొన్ని ఎగ్జిట్ పోల్స్ కాంగ్రెస్ గెలుస్తుందని చెప్తుంటే.. మరికొన్ని ఎగ్జిట్ పోల్స్ బీఆర్ఎస్ కు పట్టం కడుతున్నాయి. దీంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఎగ్జిట్ పోల్స్ పై కూడా స్పష్టత రాకపోవడంతో తెలంగాణ ఫీవర్ ఇటు ఏపీ, కర్నాటక రాష్ట్రాలకు సైతం పాకింది. దీంతో బెట్టింగ్ జోరందుకుంది. నియోజకవర్గాలు, అభ్యర్థుల వారీగా భారీగా పందేలు వేస్తున్నట్లు తెలుస్తుంది. ఇందులో చాలామంది కేసీఆర్ గెలుపు, ఆయన వ్యూహ రచనలపై నమ్మకం పెట్టుకున్నట్లు తెలుస్తుంది. ఒక్కో బెట్టింగ్ పై రూ. 10 లక్షల నుంచి కోటి రూపాయల వరకు నడుస్తున్నట్లు తెలుస్తుంది. ఏపీకి చెందిన కొందరు పందెం రాయుళ్లు భారీగా బెట్టింగ్ లు పెడుతున్నట్లు నిఘా వర్గాలు ద్వారా తెలుస్తుంది. తెలంగాణ, ఏపీలతో పాటు.. పక్క రాష్ట్రాల్లో కూడా బెట్టింగ్లు ఊపందుకున్నాయి. కచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుందని కొందరు, కాంగ్రెస్ అధికారం చేపడుతుందని మరికొందరు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఎంఐఎం, బీఆర్‌ఎస్ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాయనే అంశంపై జోరుగా బెట్టింగ్‌లు నడుస్తున్నట్టు తెలుస్తుంది. కాగా ఈ విషయంపై పోలీసులు కొందరిని అదుపులోకి తీసుకున్నారు. బెట్టింగ్లను నిర్వహించే ముఠాలపై పూర్తి నిఘా ఉంచారు.