Governor Tamilisai : నియంతృత్వ పాలనను ప్రజలు తిరస్కరించారు : గవర్నర్ తమిళిసై
X
గణతంత్ర దినోత్సవం సందర్భంగా తెలంగాణ గవర్నర్ తమిళిసై హైదరాబాద్ నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో జాతీయ పతాకాన్ని ఆమె ఎగురవేశారు. అంతకుముందు గవర్నర్‌కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, సీఎస్ శాంతికుమారి, అధికారులు స్వాగతం పలికారు. పోలీసులు, సైనికుల నుంచి గవర్నర్ గౌరవ వందనం స్వీకరించారు.ఈ సందర్బంగా గవర్నర్ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన ఆరు గ్యారంటీను 100 రోజుల్లో అమలు చేస్తామన్నారు. టీఎస్పీఎసీ ప్రక్షాళన ప్రారంభమైందని, నిరుద్యోగులు త్వరలోనే గుడ్ న్యూస్ వింటారని గవర్నర్ అన్నారు. మన రాజ్యాంగం ఎంతో మహోన్నతమైందని తమిళిసై సౌందరరాజన్ అన్నారు. రాజ్యాంగ నిర్మాతలు ఎంతో ముందుచూపుతో వ్యవహరించి దానిని తయారు చేశారని చెప్పారు.
అన్ని వర్గాల ఆశలు, ఆశయాల సాధనకు రాజ్యాంగం తోడ్పడిందని వివరించారు.అన్ని వర్గాల ఆకాంక్షల మేరకు కొత్త ప్రభుత్వం పనిచేస్తోంది. ప్రజల ముఖాల్లో ఆనందం చూడాలన్నదే లక్ష్యం. ఇచ్చిన హామీలను నెరవేర్చే కార్యాచరణ మొదలైంది. ‘మహాలక్ష్మి’ కింద మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించామని ఆమె తెలిపారు. దావోస్ సదస్సులో రూ.40 వేల కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు కుదిరాయి. ఇందుకు సీఎంను, ఆయన బృందాన్ని అభినందిస్తున్నా. రైతులకు ఇచ్చిన హామీలు నెరవేర్చేందుకు మా ప్రభుత్వం కట్టుబడి ఉంది. రూ.2 లక్షల రుణమాఫీకి బ్యాంకులతో సంప్రదింపులు జరుగుతున్నాయి. ప్రజావాణి కార్యక్రమాన్ని క్షేత్రస్థాయిలో అమలు చేసే యోచనలో ఉన్నాం’’ అని గవర్నర్ తెలిపారు.