ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం..టెలిగ్రాఫ్ యాక్ట్ కింద కేసు నమోదు
X
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. అధికారికంగా పోలీసులు ఫోన్ ట్యాపింగ్ కేసు నమోదు చేశారు. టెలిగ్రాఫ్ నిబంధనని జత చేస్తూ నాంపల్లి కోర్టులో మెమో దాఖలు చేశారు. దేశంలో అతి తక్కువ కేసుల్లోనే ఈ యాక్ట్‌ని ప్రయోగించారు. ఇప్పటి వరుకు అధికార దుర్వినియోగం, ప్రభుత్వానికి సంబంధించిన విలువైన సమాచారన్ని ధ్వంసం చేసిన కేసుల్లోనే నిందితులు ప్రణీత్, తిరుపతన్న భుజంగరావును విచారించారు. ట్యాపింగ్‌పై ఎస్‌ఐబీ అదనపు ఎస్పీ డి.రమేష్ ఫిర్యాదు మేరకు పంజగుట్ట పోలీస్‌స్టేషన్‌లో ప్రణీత్ రావు, ఇతరులపై ఈ నెల 10న కేసు నమోదైంది. దీనికి సంబంధించిన ప్రాథమిక సమాచార నివేదికలో (ఎఫ్‌ఐఆర్) పోలీసులు మూడు చట్టాల్లోని తొమ్మిది సెక్షన్ల కింద ఆరోపణలు చేశారు.
ఐపీసీ, పీడీపీపీ, ఐటీ చట్టాల్లోని సెక్షన్లు చేర్చారు. కాగా ఈ నెల 13న ప్రణీత్ అరెస్టు తర్వాత కోర్టులో రిమాండ్ కేసు డైరీని సమర్పించిన అధికారులు.. ఇందులో ఓ సెక్షన్ తగ్గించి ఎనిమిదింటి కిందే ఆరోపణలు చేశారు.తొలుత చేర్చిన ఐపీసీలోని 120 బీ (కుట్ర), 34 (ఒకే ఉద్దేశంతో చేసే ఉమ్మడి చర్య) రెండు సెక్షన్లలో.. 120 బీ సెక్షన్లను తొలగించారు. అయితే నిందితులపై ఫోన్ ట్యాపింగ్ ఆరోపణల కింద అభియోగాలు దాఖలు చేయాలంటే కచ్చితంగా ఐటీఏను జోడించి, అందులోని సెక్షన్లు వర్తింపజేయాలని న్యాయ నిపుణులు సూచించారు. ఈ నేపథ్యంలో ప్రణీత్ రావు, భుజంగరావు, తిరుపతన్నల కస్టడీ పిటిషన్లతో పాటు ఈ చట్టాన్ని జోడిస్తూ మెమోను కూడా అధికారులు కోర్టులో దాఖలు చేశారు. హార్డ్‌డిస్క్‌ల విధ్వంసంలో ప్రణీత్‌రావుతో కలిసి పాల్గొన్న హెడ్ కానిస్టేబుల్ కైతోజు కృష్ణను ఈ కేసులో సాక్షిగా చేర్చారు. నాటి ఎస్‌ఐబీ చీఫ్ టి.ప్రభాకర్‌రావు ఆదేశాల మేరకు ప్రణీత్‌రావు గత ఏడాది డిసెంబర్ 4న అర్ధరాత్రి కృష్ణతో కలిసే ఎస్‌ఐబీ కార్యాలయంలోకి వెళ్లాడు. అక్కడ తాను ఏర్పాటు చేసుకున్న వార్ రూమ్‌తో పాటు అధికారిక ట్యాపింగ్‌లు జరిగే లాగర్ రూమ్ దగ్గర సీసీ కెమెరాలను కృష్ణ ద్వారా ఆఫ్ చేయించాడు.
Kiran
కిరణ్.. జర్నలిజంలో 15ఏండ్ల అనుభవం ఉంది. ప్రస్తుతం Mic Tv Websiteలో Shift Inchargeగా పనిచేస్తున్నారు. గతంలో, ఈటీవీ -2, టీ న్యూస్, V6 న్యూస్ ఛానళ్లలో పని చేశారు. తెలంగాణ, ఏపీ రాజకీయాలు, జాతీయ, అంతర్జాతీయ, బిజినెస్, సినిమాలకు సంబంధించిన వార్తలు, విశ్లేషణలు రాయగలరు.