Home > తెలంగాణ > 11 ఏళ్ల వయస్సులో 7 లైబ్రరీలు.. హైదరాబాద్ బాలికకు ప్రధాని మోదీ ప్రశంసలు

11 ఏళ్ల వయస్సులో 7 లైబ్రరీలు.. హైదరాబాద్ బాలికకు ప్రధాని మోదీ ప్రశంసలు

11 ఏళ్ల వయస్సులో 7 లైబ్రరీలు.. హైదరాబాద్ బాలికకు ప్రధాని మోదీ ప్రశంసలు
X

దేశ ప్రధాని నరేంద్ర మోదీ.. హైదరాబాద్‌కు చెందిన స్కూల్‌ విద్యార్థిని ఆకర్షణ సతీష్‌ను ప్రశంసించారు. ఆకర్షణ సొంతంగా ఏడు గ్రంథాలయాలను స్థాపించడాన్ని మన్‌ కీ బాత్‌ కార్యక్రమంలో ప్రస్తావిస్తూ.. ఆమెకు తన అభినందనలు తెలిపారు. ప్రధాని మోదీ ప్రతి నెల ‘మన్ కీ బాత్’ రేడియో కార్యక్రమం ద్వారా అనేక విషయాలపై ప్రసంగిస్తుంటారన్న సంగతి తెలిసిందే. ప్రతినెలా చివరి ఆదివారం ప్రధాని మోడీ ప్రసంగించి పలు ఆసక్తికర విషయాలను పంచుకుంటారు. అయితే, ‘మన్ కీ బాత్’ 105వ ఎపిసోడ్‌లో భాగంగా మాట్లాడిన ప్రధాని మోడీ.. హైదరాబాద్‌ సనత్‌నగర్‌కు చెందిన ఏడవ తరగతి విద్యార్థిని ఆకర్షణ సతీశ్‌ను.. చిన్నప్పటినుంచే సేవా భావాన్ని అలవర్చుకున్నదని కొనియాడారు. పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దడం కోసం ఆకర్షణ కృషి చేస్తున్న తీరు స్ఫూర్తి నింపుతోందన్నారు.

‘‘హైదరాబాద్‌లో ఏడో తరగతి చదువుతున్న ఆకర్షణ సతీష్‌ 11 ఏళ్ల వయసులోనే.. ఏకంగా ఏడు లైబ్రరీలను నిర్వహిస్తోందని తెలిస్తే మీరు ఆశ్చర్యపోవచ్చు. రెండేళ్ల క్రితం తల్లిదండ్రులతో కలిసి క్యాన్సర్‌ ఆస్పత్రికి వెళ్లిన సందర్భంలో ఆకర్షణ స్ఫూర్తి పొందింది. వివిధ రకాల పుస్తకాలను సేకరించాలని ఆమె నిర్ణయించుకుంది. అదే క్యాన్సర్‌ ఆస్పత్రిలో పిల్లల కోసం మొదటి లైబ్రరీ ఏర్పాటు చేసింది. ఇప్పటివరకు ప్రారంభించిన ఏడు లైబ్రరీల్లో ఇప్పుడు సుమారు 6 వేల పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి’’ అని ప్రధాని వ్యాఖ్యానించారు. ‘‘ఆకర్షణ సతీశ్‌ చదవడం, కొత్త విషయాలను నేర్చుకోవడంలో ఉన్న ఆనందాన్ని హైదరాబాద్‌ పరిసర ప్రాంతాలకు విస్తరిస్తోంది. ఆకర్షణ సతీశ్ కృషికి నా అభినందనలు. ఆకర్షణను చూసి గర్విస్తున్నాను’’ అంటూ ఆమె ప్రయత్నాన్ని అభినందించారు మోదీ.

బేగంపేటలోని హైదరాబాద్‌ పబ్లిక్‌ స్కూల్‌లో చదువుతున్న ఆకర్షణసతీష్‌.. సైంటిస్ట్ కావాలని కలలు కంటోంది. ఇప్పటికే సొంతంగా ఏడు లైబ్రరీలను( 5 హైదరాబాద్‌లో, 2 తమిళనాడులో) స్థాపించిన ఈ అమ్మాయి.. ఈ ఏడాది డిసెంబర్‌కల్లా మొత్తం 10 లైబ్రరీలు ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో ముందుకెళ్తున్నానని తెలిపింది. లైబ్రరీకి కావాల్సిన పుస్తకాలను ఇరుగుపొరుగు వారు, సహ విద్యార్థులు, కుటుంబ సభ్యుల నుంచి సేకరించినట్లు తెలిపింది. ఇప్పటివరకు సుమారు 5800 పుస్తకాలను సమీకరించింది.

Updated : 25 Sept 2023 10:40 AM IST
Tags:    
Next Story
Share it
Top