తెలంగాణలోని ప్రాజెక్టుల నిర్మాణంలో అవినీతి జరిగింది : మోదీ
X
బీఆర్ఎస్ పాలన నుంచి ప్రజలు స్వేచ్ఛను కోరుకుంటున్నారని ప్రధాని మోదీ అన్నారు. కేసీఆర్ పాలనతో విసిగిపోయిన ప్రజలు ఈ ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. కామారెడ్డిలో జరిగిన బీజేపీ సకల జనుల విజయ సంకల్ప సభలో మోదీ ప్రసంగించారు. బీఆర్ఎస్ నుంచి తెలంగాణకు విముక్తి లభించాలని.. సకల జనుల సౌభాగ్య తెలగాణే తమ లక్ష్యమని స్పష్టం చేశారు. రాష్ట్రంలో బీజేపీ గాలి వీస్తోందని.. పార్టీ గెలుపుకు కార్యకర్తలు కృషి చేయాలని పిలుపునిచ్చారు.
తెలంగాణలోని ప్రాజెక్టుల నిర్మాణంలో అవినీతి జరిగిందని మోదీ ఆరోపించారు. టీఆర్ఎస్ బీఆర్ఎస్గా మారినంత మాత్రాన వారి అవినీతి మారిపోదని విమర్శించారు. కేసీఆర్, రేవంత్ను ఓటమి భయం వెంటాడుతోందని.. వాళ్లిద్దరినీ కామారెడ్డి ప్రజలు ఓడగొట్టాలని పిలుపునిచ్చారు. వారసత్వ రాజకీయాలకు తగిన బుద్ధి చెప్పాలన్నారు. బీజేపీ పేదల కోసం పనిచేస్తోందని.. పేదవాళ్లు పస్తులు ఉండకూడదన్న ఉద్ధేశ్యంతో ఉచిత రేషన్ ఇస్తున్నట్లు తెలిపారు. కిసాన్ సమ్మాన్ యోజన ద్వారా తెలంగాణలో 40లక్షల మందికి లబ్ది చేకూరిందని చెప్పారు.
ఇద్దరు ఎంపీలతో మొదలైన బీజేపీ ప్రస్థానం ఇప్పుడు 300కు చేరిందని మోదీ అన్నారు. బీజేపీ ఇచ్చిన మాట నిలబెట్టుకుంటుందని తెలిపారు. తెలంగాణకు పసుపు బోర్డు, ఆర్టికల్ 370తో పాటు ట్రిపుల్ తలాక్ రద్దు, చట్టసభల్లో మహిళలకు 30 శాతం రిజర్వేషన్, రైతులకు గిట్టుబాటు ధర, సైనికులకు వన్ ర్యాంక్ - వన్ పెన్షన్, రామ మందిర నిర్మాణం వంటి హామీలను అమలు చేశామన్నారు. తెలంగాణలోని పేదలు, మహిళలు, రైతులు, యువత, దళితుల ఆకాంక్షలను తమ మేనిఫెస్టో ప్రతిబింబిస్తోందని.. అధికారంలోకి రాగానే వాటిని అమలు చేస్తామని చెప్పారు.