కేసీఆర్ అడిగినా నేను ఒప్పుకోలేదు.. మోదీ సంచలన వ్యాఖ్యలు..
X
నిజామాబాద్ సభలో ప్రధాని మోదీ సంచలన వ్యాఖ్యలు చేశారు. జీహెచ్ఎంసీ ఎన్నికల తర్వాత కేసీఆర్ తనను కలిసిట్లు చెప్పారు. ఆ సమయంలో ఎన్డీఏలో చేర్చుకోవాలని కోరారని.. దానికి తాను ఒప్పుకోలేదన్నారు. కేటీఆర్కు బాధ్యతలు అప్పగిస్తానని కేసీఆర్ చెప్పారని.. అయితే మీరేమైనా రాజులా అని కేసీఆర్ను ప్రశ్నించినట్లు మోదీ తెలిపారు. కేసీఆర్ అవినీతి చిట్టా ఆయన ముందు పెట్టానని స్పష్టం చేశారు.
కేసీఆర్కు తన కళ్లలోకి చూసే ధైర్యం లేదని మోదీ ఎద్దేవా చేశారు. తెలంగాణ అభివృద్ధికి కోట్ల నిధులిచ్చామని.. కానీ కేంద్ర నిధులను బీఆర్ఎస్ దోచుకుందని ఆరోపించారు. తెలంగాణలో దోచుకున్నదంతా బీఆర్ఎస్ పార్టీ కర్నాటకకు పంపించిందన్నారు. వచ్చే ఐదేళ్లు తనపైన నమ్మకం ఉంచితే.. బీఆర్ఎస్ దోచుకున్నదంతా ప్రజల ముందు పెడతానని స్పష్టం చేశారు. లక్షలాది తెలంగాణ ప్రజల ఆకాంక్షలను కేసీఆర్ కుటుంబం కబ్జా చేసిందన్నారు. ప్రజాస్వామ్యాన్ని కుటుంబవాదంగా మార్చుకుందని.. కుటుంబవాదానికి ప్రజాస్వామ్యంలో చోటులేదని చెప్పారు.
అధికారంలోకి రాగానే బీఆర్ఎస్ అవినీతిని ఎండగడతామని మోదీ అన్నారు. ఉద్యమంలా బీఆర్ఎస్ దోపిడిని కడిగిపారేస్తామన్నారు. రైతులకు ఇచ్చిన రుణమాఫీ హామీని కేసీఆర్ సర్కార్ తుంగలోతొక్కిందని ఆరోపించారు. బీఆర్ఎస్ - కాంగ్రెస్ తెరవెనుక కుట్రలు చేస్తున్నాయని మండిపడ్డారు. దక్షిణ భారతదేశాన్ని మోసం చేసేందుకు కాంగ్రెస్ కుట్ర చేస్తోందన్నారు.కాంగ్రెస్ తప్పుడు మాటలతో ప్రజలను రెచ్చగొడుతోందని.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.