నవంబర్ చివరి వారంలో మరోసారి తెలంగాణకు మోడీ
X
అసెంబ్లీ ఎన్నిక ప్రచారంలో బీజేపీ జోరు పెంచింది. నామినేషన్ల ప్రక్రియ పూర్తవడంతో ప్రచారం ఉద్ధృతం చేసింది. పీఎం మోడీ సహా పలువురు జాతీయస్థాయి నాయకులతో ప్రచారానికి రంగం సిద్ధం చేసింది. ఇందులో భాగంగా ప్రధాని నరేంద్రమోడీ ఇవాళ ఎమ్మార్పీఎస్ సభలో పాల్గొననుండగా.. నవంబర్ చివరి వారంలో మరోసారి తెలంగాణలో ప్రచారానికి రానున్నారు. వరుసగా మూడు రోజుల పాటు ఆయన క్యాంపెయినింగ్ నిర్వహిస్తారు.
నవంబర్ 25న మరోసారి తెలంగాణకు రానున్న ప్రధాని మోడీ ఆ రోజున కరీంనగర్ సభలో పాల్గొంటారు. 26న నిర్మల్ లో నిర్వహించే భారీ పబ్లిక్ మీటింగ్కు హాజరవుతారు. ఇక 27న హైదరాబాద్ లో చేపట్టే రోడ్ షోలో మోడీ పాల్గోంటారు. ప్రధాని పర్యాటన షెడ్యూల్ ఖరారు కావడంతో రాష్ట్ర బీజేపీ నేతలు ఆయా సభలతో పాటు ర్యాలీకి భారీ జనసమీకరణకు సిద్ధమయ్యారు.
ఇదిలా ఉంటే ప్రచారంలో భాగంగా ప్రధాని మోడీ శనివారం సాయంత్రం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో జరిగే ఎమ్మార్పీస్ విశ్వరూప మహాసభలో పాల్గొంటారు. ‘సమగ్ర న్యాయానికి నాంది దండోరా.. చలో హైదరాబాద్’ నినాదంతో, ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు చట్టబద్ధత కల్పించాలంటూ ఈ సభ నిర్వహిస్తున్నారు. ఈ సభా వేదికపై నుంచి ప్రధాని మోడీ ఎస్సీ వర్గీకరణపై కీలక ప్రకటన చేస్తారని భావిస్తున్నారు.