Modi Telangana Tour : రేపు నిజామాబాద్కు ప్రధాని మోడీ.. షెడ్యూల్ ఇదే..
X
ప్రధాని నరేంద్రమోడీ మంగళవారం మరోసారి తెలంగాణకు రానున్నారు. ఆదివారం మహబూబ్నగర్కు వచ్చిన ఆయన రేపు నిజామాబాద్ జిల్లాలో పర్యటించనున్నారు. మంగళవారం కర్నాటకలోని బీదర్ నుంచి మోడీ నిజామాబాద్ జిల్లాకు రానున్నారు. బీదర్ నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో బయలుదేరి మధ్యాహ్నం 2:55 గంటలకు నిజామాబాద్కు చేరుకుంటారు. మధ్యాహ్నం 3 గంటల నుంచి 3:35 వరకు పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభిస్తారు. మధ్యాహ్నం 3:45 గంటలకు సభా స్థలికి చేరుకొని 4.45 గంటల వరకు సభలో పాల్గొంటారు. సాయంత్రం 5 గంటలకు నిజామాబాద్ నుంచి హెలికాప్టర్లో తిరిగి బీదర్ చేరుకోనున్నారు.
నిజామాబాద్ పర్యటనలో భాగంగా రూ. 8,021కోట్ల రూపాయల విలువైన ప్రాజక్టులను నరేంద్ర మోడీ ప్రారంభిస్తారు. ఇందూరు వేదికగా రూ.6 వేల కోట్ల వ్యయంతో నిర్మించిన ఎన్టీపీసీని 800 మెగావాట్ల విద్యుత్తు ప్రాజెక్టును మోడీ జాతికి అంకితం చేయనున్నారు. నిజామాబాద్ పర్యటనలో భాగంగా పవర్, హెల్త్, రైల్వే ప్రాజక్టులకు శంకుస్థాపన చేసిన అనంతరం.. రూ.1369 కోట్లతో నిర్మించిన హెల్త్ సెంటర్స్‌కు మోడీ భూమి పూజ చేయనున్నారు. అనంతరం ఎయిమ్స్ నూతన భవనానికి శుంకుస్థాపన చేస్తారు.
అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించిన అనంతరం నరేంద్రమోడీ గిరిరాజ్ కాలేజీ గ్రౌండ్లో నిర్వహించనున్న సభలో పాల్గొంటారు. ఈ సభ కోసం భారీ ఏర్పాట్లు చేశారు. వర్షం పడ్డా ఎలాంటి ఇబ్బంది లేకుండా 2లక్షల మంది కూర్చునేలా సభ ఏర్పాట్లు చేశారు. ఈ సభకు తొలుత ఇందూరు జనగర్జన అని పేరు పెట్టారు. అయితే ఆదివారం నాడు మహబూబ్ నగర్ వేదికగా జాతీయ పసుపు బోర్డు ఏర్పాటు చేస్తామని మోడీ ప్రకటించడంతో దాని పేరు ధన్యవాద్ సభగా మార్చారు.
మోడీ సభ నేపథ్యంలో సభాస్థలికి 3 కిలోమీటర్ల వరకు ఆంక్షలు విధించారు. ప్రతి ఒక్కరి కదలికలపై ఎస్పీజీ అధికారులు నిఘా పెట్టారు. డ్రోన్ కెమెరాలు వినియోగిస్తే కఠిన చర్యలు తప్పవని వార్నింగ్ ఇచ్చారు. సభా స్ధలీ, హెలిప్యాడ్ స్ధలాన్ని తమ ఆధీనంలో కేంద్ర బలగాలు, ఎస్పీజీ అధికారులు ఇప్పటికే తమ ఆధీనంలోకి తీసుకున్నారు.