పెండింగ్ చలాన్లపై జీవో.. గతంతో పోల్చితే కాస్త డిస్కౌంట్ ఎక్కువే
X
వాహనదారులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది. పెండింగ్ చలాన్లపై భారీ డిస్కౌంట్ను ప్రకటిస్తూ.. ఇవాళ జీవో పాస్ చేసింది. కాగా ఇవాళ్టి నుంచి పెండింగ్ చలాన్లపై డిస్కౌంట్ అమలు కానుంది. గతంలో ఇచ్చిన దానికంటే ఈ సారి ఎక్కువ డిస్కౌంట్ ఇచ్చింది ప్రభుత్వం. ఆటోలు, బైక్ చలాన్లపై 80 శాతం డిస్కౌంట్ ఇవ్వగా.. ఆర్టీసీ బస్సులు, తోపుడు బండ్ల వారికి 90 శాతం, ఫోర్ వీలర్స్, హెవీ వెహికల్స్ కు 60శాతం డిస్కౌంట్ ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వుల్లో తెలిపింది. మొదట ఈ నెల 30 నుంచి వచ్చే నెల 10వ తేదీ వరకు చలాన్లపై డిస్కౌంట్ అందుబాటులో ఉంటుందని చెప్పగా.. నాలుగు రోజుల ముందుగానే జీవో పాస్ చేయడం గమనార్హం. వాహనదారులు ఆన్లైన్, మీసేవా ద్వారా పెండింగ్ చలాన్లను చెల్లించవచ్చని పోలీస్ అధికారులు తెలిపారు.
గత ప్రభుత్వం 2022లో పెండింగ్ చలాన్లపై రాయితీ ప్రకటించింది. దీంతో రాష్ట్ర ఖజానాలోకి భారీ డబ్బు సమకూరింది. గతేడాది మార్చి 31వ తేదీ నాటికి రాష్ట్రంలో మొత్తం 2.4 కోట్ల చలాన్లు పెండింగ్‌లో ఉంటే.. వీటిని వసూలు చేసేందుకు భారీ ఆఫర్ ప్రకటించారు. బైక్‌లపై 75 శాతం, మిగిలిన వాటికి 50 శాతం రాయితీ ఇవ్వగా.. దీంతో వాహనదారుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. పెండింగ్ చలానాలు చెల్లించేందుకు జనం ఎగబడ్డారు. 45 రోజుల వ్యవధిలోనే దాదాపు రూ.300 కోట్ల పెండింగ్ చలాన్లు వసూలు అయినట్లు పోలీస్ శాఖ తెలిపింది.