జూబ్లీహిల్స్ హిట్ అండ్ రన్ కేసులో ఐదుగురి అరెస్ట్
X
జూబ్లీహిల్స్ హిట్ అండ్ రన్ కేసులో నిందుతులను పోలీసులు అరెస్ట్ చేశారు. యువతితో పాటు నలుగురు యవకులను అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం నిందితులు ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్‌లో ఉన్నారని జూబ్లీహిల్స్ ఏసీపీ హరిప్రసాద్ ప్రకటించారు. ఈకేసులో ఏ1గా కొవ్వూరి రిత్విక్‌రెడ్డి, వైష్ణవి (ఏ2), పొలుసాని లోకేశ్వర్‌రావు (ఏ3), బుల్లా అభిలాష్ (ఏ4), ఏ5గా అనికేత్ పేర్లు చేర్చినట్లు చెప్పారు.
ప్రమాదం జరిగిన వెంటనే నిందితులు పోలీసులు పట్టుకుంటారనే భయంతో పరారయ్యారు. డ్రైవింగ్ చేసిన రిత్విక్ రెడ్డి స్నేహితుడైన సురేష్ రెడ్డి ఇంట్లో కారును దాచిపెట్టాడు. అమెజాన్ కంపెనీలో పనిచేస్తున్న రిత్విక్ ఆఫీసు చూపించేందుకు స్నేహితులను తీసుకెళ్లాడు. ఆ తర్వాత పార్టీ వారంతా చేసుకున్నారు. మద్యం మత్తులో కారు నడిపిన రిత్విక్ సికింద్రాబాద్కు చెందిన తారక్ రామ్ బైక్ను ఢీకొట్టాడు. అనంతరం పరారయ్యాడు. ఈ కేసులో ప్రమాదానికి కారణమైన రిత్విక్ రెడ్డితో పాటు కారులో ఉన్న మరో నలుగురిపై పోలీసులు కేసు నమోదుచేశారు. రిత్విక్‌రెడ్డిపై సెక్షన్ 304 (2) సెక్షన్ కింద కేసు నమోదుచేయగా.. మిగిలిన వారిపై ఐపీసీ సెక్షన్ 337, ఎంవీ యాక్ట్ 337, 187 సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ బుక్ చేశారు.
సికింద్రాబాద్ గాంధీనగర్ కు చెందిన లింగాల తారక్‌రామ్ మాదాపూర్ నోవాటెల్‌లో బౌన్సర్‌గా పనిచేస్తున్నాడు. బుధవారం తెల్లవారుజామున 5 గంటలకు విధులు ముగించుకుని మరో బౌన్సర్ రాజుతో కలిసి జూబ్లీహిల్స్ మీదుగా బైకుపై గాంధీనగర్ బయల్దేరారు. జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు వైపు వెళ్తుండగా వెనక నుంచి వేగంగా వచ్చిన కారు వారి బైక్ను ఢీకొంది. ఈ ఘటనలో తారక్ తలకు తీవ్రగాయాలై అక్కడికక్కడే మృతిచెందాడు. తీవ్రగాయాలపాలైన రాజును స్థానికులు హాస్పిటల్కు తరలించారు. కారు టీఆర్ నంబరు ఆధారంగా దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితులను పట్టుకున్నారు.