Praneeth Rao : ఫోన్ ట్యాపింగ్ కేసు.. ప్రణీత్ రావు విచారణలో సంచలన విషయాలు
X
రిటైర్డ్ డీఎస్పీ ప్రణీత్ రావుపై కేసు నమోదైన విషయం తెలిసిందే. ఎస్బీఐ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పంజాగుట్ట పోలీసులు.. అతనితో పాటు మరికొందరిపై నాన్ బెయిలబుల్ కేసు బుక్ చేశారు. ప్రభుత్వ రహస్యాలను ఇతరులకు చేరవేశారనే ఆరోపణలతో ఇటీవల ఆయన సస్పెండ్ అయ్యారు. అయితే ప్రణీత్ రావును అరెస్ట్ చేసి విచారించగా.. 17 కంప్యూటర్లను ఏర్పాటుచేసుకుని రహస్య సమాచారం సేకరించినట్లు అధికారులు గుర్తించారు. సీసీ టీవీ కెమెరాలను ఆఫ్ చేసి ఆధారాలు తారుమారు చేసినట్లు తేల్చారు. ఇవే కాకుండా నిబంధనలకు విరుద్ధంగా ప్రతిపక్ష నేతల ఫోన్లు టాప్ చేసి రాష్ట్రంలో ప్రభుత్వం మారడంతో ఆ డేటా మొత్తం డిలీట్ చేసినట్లు ప్రణీత్ రావుపై తీవ్ర ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలో ప్రణీత్ రావు వ్యవహారంపై సీరియస్ అయిన ప్రభుత్వం విచారణకు ఆదేశించింది.
ఎస్బీఐ ఆఫీస్ లోని కీలక సమాచారం ఉన్న హార్డ్ డిస్క్ లు, కంప్యూటర్లు ప్రణీత్ రావు ధ్వంసం చేసినట్లు ఎస్బీఐ ఫిర్యాదు చేసింది. దీంతో అతనిపై ఐపీసీ 409, 427, 201, 120(బీ), పీడీపీపీ యాక్ట్, ఐటీ యాక్ట్ కింద కేసు ఫైల్ అయ్యింది. ప్రణీత్ రావు తాజా విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆయన స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ ఆఫీస్ నుంచి దాదాపు 42 హార్డ్ డిస్క్‌లు ధ్వంసం చేసినట్లుగా పోలీసులు గుర్తించారు. అదేవిధంగా 1,610 పేజీల కాల్ డేటాను సైతం కాలబెట్టినట్లుగా పోలీసులు నిర్ధారించారు. ఇక ఎస్ఓటి లాకర్ రూంలోని ఫైల్స్, రాష్ట్రంలోని ఓ కీలక నేత ఫోన్ ట్యాపింగ్ డేటాతో పాటు.. కాల్ రికార్డులు కొన్ని ఐఎంఈఐ నెంబర్లతో పాటు ఐపీడీఆర్ డేటాని కూడా ఆయన ట్రాష్ చేశారు. ఈ క్రమంలో ఈ కేసుకు సంబంధించిన అప్పటి ప్రభుత్వ పెద్దల పేర్లు కూడా త్వరలో బయటకొచ్చే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తుంది.