బారికేడ్లు, పోలీసులతో.. రేవంత్ ఇంటి భద్రత పెంపు
X
తెలంగాణ సీఎంగా రేవంత్ రెడ్డి పేరు ఖరారైంది. ఈ నెల 7న కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరనుంది. సుధీర్ఘ చర్చల తర్వాత అధిష్టానం రేవంత్ ను సీఎంగా ప్రకటించింది. కాగా ఎన్నికలు పూర్తైనప్పటి నుంచే రేవంత్ రెడ్డి నివాసం వద్ద పోలీస్ భద్రతను ఏర్పాటుచేశారు. రేవంత్ కు సెక్యూరిటీని పెంచారు. తాజాగా రేవంత్ ను కాంగ్రెస్ పార్టీ సీఎంగా ప్రకటించిన తర్వాత సెక్యూరిటీని కట్టుదిట్టం చేశారు. జూబ్లీహిల్స్ సీబీఐ కాలనీలోని ఆయన నివాసం వద్ద భద్రతను ఇంకా పెంచారు. సీఎంగా ప్రమాణస్వీకారం చేపట్టిన తర్వాత ప్రోటోకాల్ ప్రకారం రేవంత్ వద్ద పూర్తిస్థాయి సెక్యూరిటీని ఏర్పాటుచేస్తారు. ప్రస్తుతం రేవంత్ ఇంటి వద్ద 15 మందికి పైగా పోలీసులు ఉన్నారు. బారికేడ్లు పెట్టి భద్రత కల్పించారు. దీంతో ఆయన ఇంటి పరిసర ప్రాంతాల్లో హడావిడి వాతావరణం ఏర్పడింది. ప్రస్తుతం ఢిల్లీలో ఉన్న రేవంత్ రెడ్డి.. హైదరాబాద్ కు తిరిగి వచ్చాక పెద్ద ఎత్తున కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఆయన ఇంటికి వచ్చే అవకాశం ఉంది. ఆ కారణంగా భద్రతను కట్టుదిట్టం చేసినట్లు పోలీసులు తెలిపారు.