Brs Mla Shakeel : బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే షకీల్పై లుకౌట్ నోటీసులు
X
బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే షకీల్కు పోలీసులు షాకిచ్చారు. ఆయనపై లుకౌట్ నోటీసులు జారీ చేశారు. పంజాగుట్ట ప్రమాదం కేసులో తన కుమారుడిని తప్పించడానికి షకీల్ ప్రయత్నించినట్లు ఆరోపణలున్నాయి. కొడుకు రాహిల్తో పాటు షకీల్ కూడా దుబాయ్ పారిపోయినట్లు పోలీసులు తెలిపారు. నిందితుడికి పోలీసులు సహకరించినట్లు ఆధరాలున్నాయన్నారు. ఈ కేసులో మొత్తం 16మందిపై కేసు నమోదు చేసినట్లు తెలిపిన పోలీసులు.. ఏడుగురు పరారీలో ఉన్నట్లు చెప్పారు. వారందర్నీ త్వరలోనే పట్టుకుంటామని స్పష్టం చేశారు.
ఇప్పటికే ఈ కేసులో పంజాగుట్ట సీఐతోపాటు బోధన్ సీఐని పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రమాదం సమయంలో పంజాగుట్ట సీఐ దర్గారావు విధుల్లోనే ఉన్నట్లు పోలీసులు తెలిపారు. షకీల్ కొడుకుని తప్పించడంలో అతడు కీలకంగా వ్యవహరించినట్లు గుర్తించారు. అప్పటి నుంచి అతడు పరారీలో ఉండగా.. సోమవారం అనంతపురం జిల్లాలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగా డిసెంబర్ 23న అర్ధరాత్రి సమయంలో రాహిల్ అతివేగంగా కారు నడిపి ప్రజాభవన్ ముందు ఉన్న ట్రాఫిక్ బారికేడ్లను కారుతో ఢీ కొట్టాడు. కారు నడిపింది తానే అంటూ డ్రైవర్ ఆసీఫ్ పోలీసులకు లొంగిపోయాడు. అయితే సీసీటీవీ పుటేజీలో సాహిల్ కారు నడిపినట్లు ఉండడంతో పోలీసులు రాహిల్ సహా షకీల్ పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.