ఏలేటి మహేశ్వర్ రెడ్డి దీక్ష భగ్నం.. హాస్పిటల్కు తరలింపు
X
నిర్మల్ మున్సిపాలిటీ మాస్టర్ ప్లాన్ జగడం కొనసాగుతోంది. మాస్టర్ ప్లాన్ రద్దు చేయాలంటూ గత 5 రోజులుగా బీజేపీ నేత, మాజీ ఎమ్మెల్యే ఏలేటీ మహేశ్వర్ ఆమరణ దీక్ష చేస్తున్నారు. దీంతో ఆయన ఆరోగ్యం క్షీణించింది. ఈ క్రమంలో వైద్య పరీక్షలు చేసిన డాక్టర్లు బీపీ, షుగర్ లెవెల్స్ పడిపోయినట్లు గుర్తించారు. వెంటనే ఆయనను హాస్పిటల్ కు తరలించాలని సూచించారు. దీంతో పోలీసులు మహేశ్వర్ రెడ్డి ఆమరణ దీక్ష భగ్నం చేసి ఆయనను నిర్మల్ ఏరియా ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయనకు అక్కడ ట్రీట్మెంట్ కొనసాగుతోంది. మెరుగైన చికిత్స కోసం మహేశ్వర్ రెడ్డిని హైదరాబాద్ తరలించే అవకాశమున్నట్లు తెలుస్తోంది.
నిర్మల్ మాస్టర్ ప్లాన్ రద్దు చేసే దాకా పోరాటం కొనసాగిస్తానని బీజేపీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి తేల్చి చెప్పారు. ఆస్పత్రిలోనూ ఆమరణదీక్ష కొనసాగిస్తానని స్పష్టం చేశారు. అర్ధరాత్రి దొంగచాటుగా వచ్చిన పోలీసులు దీక్షను భగ్నం చేశారని ఆయన మండిపడ్డారు. మరోవైపు మెరుగైన చికిత్స కోసం మహేశ్వర్ రెడ్డిని హదరాబాద్ తరలించాలన్న డాక్టర్ల సూచనను కుటుంబ సభ్యులు తోసిపుచ్చారు. నిర్మల్ లోనే ట్రీట్మెంట్ అందించాలని కోరారు.
ఇదిలా ఉంటే నిర్మల్ ఏరియా హాస్పిటల్లో చికిత్స పొందుతున్న ఏలేటి మహేశ్వర్‌రెడ్డిని పరామర్శించేందుకు తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి నిర్మల్ వెళ్లేందుకు సిద్ధమయ్యారు. దీక్ష భగ్నం సందర్భంగా పోలీసుల లాఠీఛార్జ్‌లో గాయపడ్డ బీజేపీ కార్యకర్తలను కూడా ఆయన కలవాలనుకున్నా శాంతి భద్రతల దృష్ట్యా నిర్మల్ కు రావద్దన్న పోలీసుల సూచనతో కిషన్ రెడ్డి తన పర్యటన రద్దు చేసుకున్నారు. మరోవైపు నిర్మల్ మాస్టర్ ప్లాన్ రద్దు కోసం దీక్ష చేస్తున్న ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఇంటి ముట్టడికి బీఆర్ఎస్ పిలుపునిచ్చింది. దీంతో పోలీసులు అలర్టయ్యారు. మహేశ్వర్ రెడ్డి ఇంటికి వెళ్లే దారులను మూసివేశారు.