Home > తెలంగాణ > తూటాలు దించిన పోలీసు తుపాకే సెల్యూట్ కొట్టింది.. గద్దర్‌కు అరుదైన గౌరవం.. విమర్శ సంగతేమిటి?

తూటాలు దించిన పోలీసు తుపాకే సెల్యూట్ కొట్టింది.. గద్దర్‌కు అరుదైన గౌరవం.. విమర్శ సంగతేమిటి?

తూటాలు దించిన పోలీసు తుపాకే సెల్యూట్ కొట్టింది.. గద్దర్‌కు అరుదైన గౌరవం.. విమర్శ సంగతేమిటి?
X

బహుశా దేశ చరిత్రలోనే ఇలాంటి అంత్యక్రియలు ఎవరికీ జరిగి ఉండవు. 40 ఏళ్లకుపై ప్రభుత్వాల దమనకాండకు వ్యతిరేకంగా గొంతు విప్పి, హాహా హూహూ అంటూ సింహగర్జనతో నిప్పులు చెరిగిన గద్దర్‌కు చివరికి రాష్ట్ర ప్రభుత్వమే అన్ని అధికార లాంఛనాలతో అంత్యక్రియలు జరిపించింది. ఆయనను మట్టుబెట్టడానికి ఒంట్లోకి తూటాలు పేల్చిన పోలీసుల తుపాకులే ఇప్పుడు ఆయనకు గౌరవవందనం సమర్పించాయి. ప్రజా ఉద్యమాలకు, తెలంగాణ ప్రత్యేక ఉద్యమానికి తన ఆటపాటలతో అసమాన సేవలు అందించినందుకు గుర్తింపుగా తెలంగాణ ప్రభుత్వం ఈ సంచలన నిర్ణయం తీసుకుంది. ఆయన కుటుంబ సభ్యులు కూడా అంగీకరించడంతో ఒకప్పుడు ఆయనను చంపడానికి వేటాడిన ఖాకీ తుపాకులే ఇప్పుడు విన్రమంగా గాల్లోకి తుపాకులు పేల్చి సెల్యూట్ చేశాయి.

దీనిపై ‘యాంటీ టెర్రరిస్ట్ ఫోరమ్’ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. పోలీసులు ప్రాణాలు తీసే నక్సలైట్ ఉద్యమంపై పాటలు రాసిన మనిషికి అధికార లాంఛనాలతో అంత్యక్రియలు జరపడమంటే పోలీసులను, పోలీసు అమరులను కించపరచడమేని విమర్శలు వస్తున్నాయి. అయితే గద్దర్ కేవలం నక్సలైట్ల గురించే కాకుండా సమాజంలోని అన్ని వర్గాల ప్రజల గురించి, ‘అమ్మా తెలంగాణమా, ఆకలి కేకల గానమా’ వంటి అద్భుతమైన పాటలు పాడారు కాబట్టి తెలంగాణ ప్రభుత్వం ఆయనకు గౌరవ లాంఛనాలతో వీడ్కోలు పలకడం తప్పేదీ కాదనే వాదన కూడా వినిపిస్తోంది. గద్దర్ విప్లవ రాజకీయాలనుంచి పక్కకు తప్పుకుని దశాబ్దం దాటిపోయింది కాబట్టి ఆయన సాధారణ ప్రజాగాయకుడు మాత్రమే అని అంటున్నారు. గద్దర్ చివరిదాకా ప్రభుత్వాల అణచివేతను వ్యతిరేకించాడని, ఆలాంటి వ్యక్తికి హింసకు చిహ్నమైన పోలీసు తుపాకీతో నివాళి అర్పించడం ఆయనను అగౌరవించడమేమనని విమర్శలు వస్తున్నాయి. అయితే గద్దర్ ప్రజా నిబద్ధతకు, కళాశక్తికి ప్రభుత్వమే దిగివచ్చి నివాళి అర్పించుకుని గౌరవం పెంచుకుందని మరొక వాదన. ఏది ఏమైనా గద్దర్ జీవితంలోని వైరుధ్యాలు అంత్యక్రియల్లోనూ కనిపించడం గమనార్హం. హింస వద్దు, ఓట్ల రాజకీయాలే ముద్దు అని నక్సల్బరీ దారి నుంచి పక్కకు మళ్లిన గద్దర్ పాతికేళ్లుగా ఒంట్లో పోలీసుల తూటాను మోస్తూ, పోలీసుల తూటా వందనాలతోనే నిష్క్రమించడం చరిత్రలో నిలిచిపోయే ఘట్టం.

గద్దర్ నక్సల్బరీ ఉద్యమానికి అండగా పాటలు పాడుతూ తమకు కంటగింపుగా మారాడని పోలీసులు ఆయనను అంతమొందించడానికి అనేక ప్రయత్నాలు చేశారు. దీంతో ఆయన అజ్ఞాత జీవితంలో వెళ్లిపోయారు. 1990 దశకం మొదట్లో మళ్లీ ప్రజాజీవితంలో వచ్చి మళ్లీ పాటలు సంధించారు. 1997 ఏప్రిల్ 6న పోలీసులు ఆయనపై కాల్పులు జరిపారు. వైద్యులు ఆపరేషన్ చేసి కొన్ని తూటాలు తీశారు. అయిత వెన్నులో ఇరుక్కున్న ఒక తూటాను బయటికి తీస్తే ప్రాణాలకు ముప్పు అని అలాగే వదిలేశారు. పాతికేళ్లకుపైగా గద్దర్ ఆ తూటా బాధను భరిస్తూనే ఉద్యమాల్లో పాల్గొన్నారు. గత నెల 31న ప్రజలకు రాసిన లేఖలోనూ ‘‘నా వెన్నుపూసలోని తూటా వయస్సు 25 ఏండ్లు’’ అని ప్రస్తావించారు.


Updated : 7 Aug 2023 2:47 PM GMT
Tags:    
Next Story
Share it
Top