Telangana: ఎన్నికల కోడ్.. తొలిరోజే భారీగా బంగారం, నగదు స్వాధీనం
X
ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో రాష్ట్రంలో ఎలక్షన్ కోడ్ అమల్లోకి వచ్చింది. ఈ క్రమంలో పోలీసులు విస్తృత తనిఖీలు నిర్వహిస్తున్నారు. కోడ్ అమల్లోకి వచ్చిన తొలిరోజే భారీగా బంగారం, వెండి, నగదు స్వాధీనం చేసుకున్నారు. ఓటర్లకు పంచేందుకు సిద్దం చేసిన కుక్కర్లను పట్టుకున్నారు
బషీర్ బాగ్లోని నిజాం కాలేజీ ఎదుట విధుల్లో ఉన్న పోలీసులు కొన్ని వాహనాలపై అనుమానంతో తనిఖీలు నిర్వహించారు. ఈ సోదాల్లో సరైన పత్రాలు లేని 7.50 కిలోల బంగారం, 300 కిలోల వెండిని పట్టుకున్నారు. చందానగర్ పరిధి తారానగర్‌లో వాహనాల తనిఖీల్లో 5.56 కిలోల బంగారం స్వాధీనం చేసుకున్న పోలీసులు ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు.
రంగారెడ్డి జిల్లాలోని ఫరూక్ నగర్ మండలం రాయికల్ టోల్ ప్లాజా వద్ద అశోక్ అనే వ్యక్తి బైక్పై తీసుకెళ్తున్న రూ.11.50లక్షలు పట్టుకున్నారు. నగదుకు సంబంధించి సరైన డాక్యుమెంట్లు చూపిస్తే తిరిగి ఇచ్చేస్తామని చెప్పారు. వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆటోనగర్లో వాహనాల తనిఖీలోరూ.5.14 లక్షలు పట్టుబడ్డాయి.
ఇక గచ్చిబౌలిలోని గోపన్పల్లి తండాలో భారీ సంఖ్యలో కుక్కర్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సదరు కుక్కర్ బాక్సులపై శేరిలింగంపల్లి కాంగ్రెస్ నేత మారబోయిన రఘునాథ్ యాదవ్ పేరు ఉంది. కుక్కర్లతో పట్టుబడిన రాములు నాయక్, నర్సింహా అనే ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు.