కాంగ్రెస్ గెలవలేదు.. బీఆర్ఎస్ ఓడింది : ప్రశాంత్ కిషోర్
X
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై ప్రముఖ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ స్పందించారు. తెలంగాణలో కాంగ్రెస్ గెలిచిందని అనడం కంటే బీఆర్ఎస్ ఓడిందని అంటేనే బాగుంటుందన్నారు. బీఆర్ఎస్పై ఉన్న వ్యతిరేకతే ఆ పార్టీని ఓడించిందని అభిప్రాయపడ్డారు. తెలంగాణలో కాంగ్రెస్ తన సొంత బలంతో గెలవలేదని.. ప్రజలు కాంగ్రెస్ను బీఆర్ఎస్కు ప్రత్యామ్నాయం అని భావించడమే ఆ పార్టీ విజయానికి కారణమని చెప్పారు. అంతే తప్ప కాంగ్రెస్ను చూసి ఎవరూ ఓటు వేయలేదని తెలిపారు.
ఇటీవల ఎన్నికలు జరిగిన 5 రాష్ట్రాల్లో.. మధ్యప్రదేశ్ మినహా తెలంగాణ, ఛత్తీస్ గఢ్, రాజస్థాన్, మిజోరం రాష్ట్రాల్లో ప్రభుత్వ వ్యతిరేకత తీవ్రంగా ఉందని ప్రశాంత్ కిషోర్ అన్నారు. ఈ వ్యతిరేకతే ఇతర పార్టీల గెలుపుకు కారణమైందని వివరించారు. మధ్యప్రదేశ్లో బీజేపీ అధికారం నిలబెట్టుకోగా... తెలంగాణలో కాంగ్రెస్, ఛత్తీస్ గఢ్, రాజస్థాన్లలో బీజేపీ విజయం సాధించింది. హిందుత్వ విధానాలను బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లడమే బీజేపీ విజయానికి కారణమని పీకే చెప్పారు.