రాష్ట్రవ్యాప్తంగా మొదలైన పోలింగ్.. ఓటేయనున్న 3.26 కోట్ల మంది ఓటర్లు
X
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ మొదలైంది. రాష్ట్రంలోని 119 అసెంబ్లీ సీట్లకు జరుగుతున్న ఎన్నికలో ఓటు హక్కు వినియోగించుకునేందుకు జనం ఉత్సాహం చూపుతున్నారు. కొన్ని చోట్ల ఉదయం 6.30 గంటల నుంచే పోలింగ్ స్టేషన్ల వద్ద క్యూ కట్టారు. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం ఐదింటి వరకు కొనసాగనుంది. పోలింగ్ సమయం ముగిసే సమయానికి క్యూలైన్లలో ఉన్న ఓటర్లందరికీ ఓటు వేసే అవకాశం ఇవ్వనున్నారు. రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో బరిలో ఉన్న 2290 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని ఓటర్లు ఈవీఎంలలో నిక్షిప్తం చేస్తున్నారు.
రాష్ట్రంలో మొత్తం 3.26 కోట్ల మంది ఓటర్లు ఉండగా.. వారిలో 1.62 కోట్లకుపైగా పురుష, 1.63 కోట్లకుపైగా మహిళా ఓటర్లు ఉన్నారు. 2,676 మంది థర్డ్ జెండర్ ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. పోలింగ్ కోసం ఎన్నికల సంఘం రాష్ట్రవ్యాప్తంగా 35,356 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసింది. వాటిలో 12వేలకుపైగా సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలుగా గుర్తించారు. ఎలక్షన్ కమిషన్ 27,094 పోలింగ్ స్టేషన్లలో వెబ్ క్యాస్టింగ్ ఏర్పాటు చేసింది. ఈ సారి అసెంబ్లీ ఎన్నికల్లో హ్యాట్రిక్ విజయం సాధించి ముచ్చటగా మూడోసారి అధికారం చేపట్టాలని బీఆర్ఎస్ భావిస్తోంది. కర్నాటక అసెంబ్లీ ఫలితాలు ఇచ్చిన జోష్తో జోరుమీదున్న కాంగ్రెస్ విజయంపై ధీమాతో ఉంది. ఇక డబుల్ ఇంజిన్ సర్కారు నినాదంతో ముందుకెళ్తున్న బీజేపీ ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ విజయం సాధించాలని కంకణం కట్టుకుంది.
బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ గత ఎన్నికల్లో గజ్వేల్ నుంచి పోటీ చేయగా.. ఈసారి ఆ స్థానంతో పాటు కామారెడ్డి నుంచి కూడా బరిలో దిగారు. ఇక కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సైతం రెండు చోట్ల పోటీ చేస్తున్నారు. సొంత నియోజకవర్గమైన కొడంగల్తో పాటు కేసీఆర్ పోటీ చేస్తున్న కామారెడ్డి నుంచి కూడా బరిలో దిగారు. ఇక బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ కూడా కేసీఆర్పై పోటీకి దిగారు. ఆయన హుజూరాబాద్ నియోజకవర్గంతో పాటు గజ్వేల్ నుంచి బరిలో ఉన్నారు.