పొంగులేటికి 8, జూపల్లికి 5.. కాంగ్రెస్తో లెక్క కుదిరినట్లేనా..!
X
బీఆఎస్ నుంచి సస్పెండైన ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస రెడ్డి, మహబూబ్ నగర్ జిల్లా నేత జూపల్లి కృష్ణారావు రాజకీయ భవితవ్యంపై క్లారిటీ వచ్చినట్లే కనిపిస్తోంది. వారిద్దరూ ఈ నెల 25న కాంగ్రెస్లో చేరనున్నట్లు రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ నడుస్తోంది. సోమవారం పొంగులేటి, జూపల్లితో భేటీ అయిన రాహుల్ గాంధీ టీం ముందు వారిద్దరూ తమ డిమాండ్లను పెట్టినట్లు తెలుస్తోంది. వాటిలో మెజార్టీ డిమాండ్లకు ఓకే చెప్పినట్లు సమాచారం.
రాహుల్ టీం ముందు డిమాండ్లు
ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి జిల్లాలోని 10 అసెంబ్లీ సీట్లలో 8 తన అనుచరులకు ఇవ్వాలని డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది. మరోవైపు మాజీ మంత్రి జూపల్లి ఉమ్మడి పాలమూరులోని ఐదు అసెంబ్లీ సెగ్మెంట్ల టికెట్లు కోరినట్లు సమాచారం. తాను పోటీ చేయనున్న కొల్లాపూర్ నియోజకవర్గంతో పాటు వనపర్తి, నాగర్ కర్నూల్, కల్వకుర్తి, మహబూబ్ నగర్ టికెట్లను తన సన్నిహితులకు కేటాయించాలని రాహుల్ టీంకు స్పష్టం చేసినట్లు ఉహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే జూపల్లి అడిగిన ఐదింటిలో నాలిగింటికి కాంగ్రెస్ హైకమాండ్ ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం రాహుల్ గాంధీతో పాటు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనలో ఉన్నారు. వారు వచ్చిన వెంటనే మరోసారి చర్చించి టికెట్లు కన్ఫామ్ చేసే అవకాశముంది.
క్లారిటీకి వచ్చిన ఇద్దరు నేతలు
పొంగులేటితో పాటు జూపల్లిని బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ చేసి దాదాపు రెండు నెలలు దాటింది. దీంతో వారి రాజకీయ భవితవ్యంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. రాష్ట్రంలో అధికార పార్టీకి బుద్ది చెప్పేందుకు వారిద్దరూ బీజేపీలో చేరుతారా లేక కాంగ్రెస్తో జట్టుకడతారా అన్న దానిపై అనేక ఊహాగానాలు వినిపించాయి. ఒకదశలో వారిద్దరూ రాజకీయ పార్టీ ప్రకటన చేసే అవకాశముందన్న వార్తలు వచ్చాయి. రెండు నెలలుగా జూపల్లి, ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి వరుసగా పలువురు నేతలు, మేధావులతో చర్చలు జరిపారు. ప్రస్తుత పరిణామాల దృష్ట్యా కాంగ్రెస్ పార్టీలో చేరడమే మంచిదన్న నిర్ణయానికి జూపల్లి, పొంగులేటి వచ్చినట్లు తెలుస్తోంది.
జోరు పెంచిన కాంగ్రెస్
మరోవైపు టాస్క్ తెలంగాణ పేరుతో కాంగ్రెస్ సైతం కార్యకలాపాల వేగం పంపింది. ఇందులో భాగంగా త్వరలోనే ఢిల్లీలో ప్రత్యేక మీటింగ్ నిర్వహించేందుకు ఏఐసీసీ నిర్ణయించింది. రాహుల్, రేవంత్‌లు అమెరికా పర్యటన నుంచి తిరిగి రాగానే, ఢిల్లీలో ప్రత్యేక మీటింగ్‌ను ఏర్పాటు చేయనున్నారు. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ సమక్షంలో తెలంగాణ టీ కాంగ్రెస్ లీడర్లు, టీమ్‌లకు సునీల్ కనుగోలు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.