ఆరు గ్యారెంటీల అమలుపై మంత్రి పొంగులేటి కీలక ప్రకటన
X
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రకటించిన ఆరు గ్యారంటీల్లో కాంగ్రెస్ పార్టీ రెండింటిని విజయవంతంగా అమలు చేసింది. మిగిలిన నాలుగు గ్యారంటీలను త్వరలోనే అమలు పరుస్తామని గతంలో జరిగిన కేబినెట్ మీటింగ్ లో సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. తాజాగా దీనిపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఆదివారం అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రుల సమావేశం జరిగింది. సమావేశం అనంతరం మాట్లాడిన పొంగులేటి.. డిసెంబర్ 28 నుంచి జనవరి 6 వరకు దరఖాస్తు స్వీకరిస్తామని ఆయన తెలిపారు. అర్హత ఉన్నవాళ్లు గ్రామ సభల్లో అధికారులకు దరఖాస్తు ఇవ్వాలని సూచించారు. దరఖాస్తు ఇచ్చినవారికి సంబంధింత అధికారులు ఒక రసీదు ఇస్తారని చెప్పారు.
ఇందిరమ్మ పాలనలో ఇంటి వద్దకే పాలన అందుతుంది. అధికారులు ఇంటికి వచ్చి దరఖాస్తులు స్వీకరిస్తారు. మారుమూల పల్లెలు, గూడెంలకు కూడా వెళ్తారు. 10 ఇళ్లులు ఉన్నా.. అధికారులే వచ్చి అప్లికేషన్స్ తీసుకుంటారని స్పష్టం చేశారు పొంగులేటి. ఇదివరకు ఆర్టీసీ బస్సుల్లో మహిళలు 33 శాతం ప్రయాణించేవారని, ప్రస్తుతం అది 58 శాతానికి పెరిగిందని అన్నారు. గత ప్రభుత్వం ధరణి పోర్టల్ ద్వారా ప్రభుత్వం భూములను కబ్జా చేసిందని ఆరోపించారు. వాటిని స్వాధీనం చేసుకుని ప్రజలకు పంచుతామని చెప్పారు. యువతకు డ్రగ్స్ ఎంత ప్రమాదమో.. రైతులు నష్టపోవడానికి నకిలీ విత్తనాలు అంతే ప్రమాదం అని అన్నారు. కాంగ్రెస్ ప్రకటించిన ఏ పథకంలో కోత పెట్టమని స్పష్టం చేశారు.