డేట్ ఫిక్స్.. జులై 2న కాంగ్రెస్లో చేరనున్న పొంగులేటి..
X
బీఆర్ఎస్ నుంచి సస్పెండైన ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరడం ఖాయమైంది. ఆయన హస్తం పార్టీ కండువా కప్పుకునేందుకు ముహూర్తం సైతం ఫిక్సైంది. జూలై 2న పొంగులేటి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోనున్నారు. ఖమ్మంలో నిర్వహించే భారీ బహిరంగ సభలో రాహుల్ గాంధీ సమక్షంలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ గూటికి చేరనున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే ఏర్పాట్లు షురువైనట్లు తెలుస్తోంది. సభకు దాదాపు 5 లక్షల మంది హాజరయ్యేలా చూడాలని పొంగులేటి నిర్ణయించినట్లు సమాచారం.
పొంగులేటితో పాటు జూపల్లి సైతం కాంగ్రెస్ పార్టీలో చేరడం లాంఛనమేకానుంది. ఈ క్రమంలోనే టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి, ఎంపీ కోమటి రెడ్డి వెంకటరెడ్డి ఆ ఇరువురు నేతలతో భేటీ అయ్యారు. బుధవారం మధ్యాహ్నం తొలుత జూపల్లి కృష్ణారావు నివాసానికి వెళ్లిన రేవంత్, కోమటిరెడ్డి ఆయనతో కాసేపు ముచ్చటించారు. అనంతరం ముగ్గురు నేతలు కలిసి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నివాసానికి వెళ్లారు. అక్కడ లంచ్ చేసిన తరువాత కాంగ్రెస్లో చేరిక, బహిరంగ సభ ఏర్పాట్లతో పాటు ఇతర అంశాలపై చర్చించారు.
బీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండైన అనంతరం పొంగులేటి, జూపల్లి ఏ పార్టీలో చేరుతారన్న దానిపై ఉత్కంఠ నెలకొంది. తొలుత వారు బీజేపీలో చేరుతారని వార్తలు వచ్చాయి. ఆ తర్వాత కాంగ్రెస్ వైపు చూస్తున్నారని ఊహాగానాలు వినిపించాయి. ఒక దశలో పొంగులేటి సొంతంగా పార్టీ పెడతారన్న వార్తలు చక్కర్లు కొట్టాయి. అయితే కర్నాటక అసెంబ్లీ ఎన్నికల అనంతరం జోరు పెంచిన కాంగ్రెస్ పొంగులేటితో పాటు జూపల్లిని తమవైపు తిప్పుకోవడంలో సక్సెస్ అయ్యారు. దాదాపు నాలుగైదు నెలల చర్చోపచర్చల తర్వాత ఫైనల్గా నిర్ణయానికి వచ్చిన పొంగులేటి కాంగ్రెస్ తో కలవాలని నిర్ణయించుకున్నారు. జూన్ 2న నిర్వహించనున్న కాంగ్రెస్ భారీ బహిరంగసభకు సంబంధించి ఒకట్రెండు రోజుల్లో అధికారిక ప్రకటన వచ్చే అవకాశముంది.