Home > తెలంగాణ > కేసీఆర్ను గద్దె దింపేందుకు కాంగ్రెస్లో చేరుతున్నాం - పొంగులేటి

కేసీఆర్ను గద్దె దింపేందుకు కాంగ్రెస్లో చేరుతున్నాం - పొంగులేటి

కేసీఆర్ను గద్దె దింపేందుకు కాంగ్రెస్లో చేరుతున్నాం - పొంగులేటి
X

సస్పెన్స్కు తెరపడింది. బీఆర్ఎస్ బహిష్కృత నేతలు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు రాజకీయ భవితవ్యంపై స్పష్టత వచ్చింది. ఢిల్లీలో కాంగ్రెస్ ప్రెసిడెంట్ మల్లిఖార్జున ఖర్గే, పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీతో భేటీ అనంతరం ఇరువురు నేతలు కాంగ్రెస్లో చేరుతున్నట్లు ప్రకటించారు. సీఎం కేసీఆర్ ను గద్దె దింపేందుకే తాము హస్తం పార్టీతో కలిసి నడవాలని నిర్ణయించినట్లు చెప్పారు.

కొత్త పార్టీ పెట్టాలనుకున్నా

సీఎం కేసీఆర్ పాలనతో ప్రజలు విసిగిపోయారని పొంగులేటి అన్నారు. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ను కాదని, ప్రజలు కేసీఆర్ ను గెలిపించారని, కానీ ప్రజల ఆంకాంక్షలను ఆయన నెరవేర్చలేదని మండిపడ్డారు. మాటల గారడీలో సిద్ధహస్తుడైన సీఎం కేసీఆర్‌ ను గద్దె దించేందుకే కాంగ్రెస్‌లో చేరుతున్నట్లు పొంగులేటి స్పష్టం చేశారు. పథకాల పేరుతో మాయ చేస్తున్న కేసీఆర్ కు బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని అన్నారు. ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించి, రాష్ట్రంలోని పరిస్థితులపై సర్వేలు చేయించి వాటి ఆధారంగా ప్రాంతీయ పార్టీ పెట్టాలని భావించానని పొంగులేటి అన్నారు. అయితే కొత్త పార్టీ వల్ల ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలుతుందని భావించే ఆ వైపు అడుగులేయలేదని స్పష్టం చేశారు.

జులై 2న చేరిక

రాష్ట్రంలో బీజేపీ పరిస్థితి దారుణంగా మారిందని పొంగులేటి అన్నారు. ప్రస్తుత పరిణామాలన్నింటినీ బేరీజు వేసుకుని రాహుల్ తో భేటీ అయినట్లు చెప్పారు. జులై 2న ఖమ్మంలో రాహుల్‌ గాంధీ సమక్షంలో కాంగ్రెస్‌లో చేరనున్నట్లు పొంగులేటి ప్రకటించారు. బీఆర్ఎస్ ఆవిర్భావ సభను మించి కనీవిని ఎరుగని రీతిలో ఖమ్మం సభ జరుగుతుందని చెప్పారు. ఖమ్మం సభకు ఎన్ని లక్షల మంది వస్తారో లెక్కలేసుకోండని బీఆర్ఎస్ నేతలకు సవాల్‌ విసిరారు.

దేవుడు కూడా క్షమించడు

తెలంగాణ ఉద్యమంలో వందల మంది ప్రాణత్యాగం చేసిన విషయాన్ని జూపల్లి కృష్ణారావు గుర్తు చేశారు. అప్పట్లో పదవులు వదిలి ఉద్యమంలో పాల్గొన్నామని చెప్పారు. తెలంగాణ వచ్చాక అంచనాలన్నీ తప్పాయని, కేసీఆర్‌ పాలనంతా బోగస్‌ మాటలు, పథకాలతో సాగుతోందని మండిపడ్డారు. కొత్త పథకాలతో జిమ్మిక్కులు చేస్తున్న కేసీఆర్ ప్రశ్నించే గొంతుకే ఉండొద్దని భావిస్తున్నారని అన్నారు. కేసీఆర్‌ నియంతృత్వ ధోరణి పరాకాష్టకు చేరిందని జూపల్లి మండిపడ్డారు.


Updated : 26 Jun 2023 8:27 PM IST
Tags:    
Next Story
Share it
Top