రేణుకా చౌదరీతో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి భేటీ.. చేరికపై చర్చ
X
పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్లో చేరడం కన్ఫార్మ్ అయ్యింది. ఈ క్రమంలో ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని సీనియర్ నేతలతో ఆయన వరుస సమావేశమవుతున్నారు. ఇప్పటికే పాదయాత్ర చేస్తున్న భట్టి విక్రమార్కను కలిసిన పొంగులేటి.. తాజాగా రేణుక చౌదరీని కలిశారు. రాహుల్ గాంధీతో సమావేశం అయ్యేందుకు ఆదివారం రాత్రే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు
ఢిల్లీ వెళ్లారు. ఈ క్రమంలోనే హైకమాండ్ సూచనతో ఆయన రేణుకా చౌదరీని కలిసినట్లు తెలుస్తోంది.
కాంగ్రెస్లో చేరికపై పొంగులేటి ఆహెతో చర్చించినట్లు తెలుస్తోంది. కాగా పొంగులేటి చేరికను ఆమె వ్యతిరేకిస్తున్నారనే వార్తలొచ్చాయి. ఈ నేపథ్యంలో వీరి సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ సమావేశంపై రేణుకా చౌదరీ స్పందించారు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో తనది క్యాజువల్ మీటింగ్ అని ఆమె తెలిపారు. పొంగులేటి ఎలాంటి డిమాండ్లు చేయలేదని.. మరికొన్ని రోజుల్లో ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరుతారని చెప్పారు. తన రాజకీయం అంతా ఢిల్లీలోనే అని.. ఎమ్మెల్యేగా పోటీ చేయడం లేదని స్పష్టం చేశారు.
కాంగ్రెస్ పార్టీలోకి ఎవరు వచ్చిన ఆహ్వానిస్తామని రేణుక చౌదరి తెలిపారు. బీజేపీలో ఉన్న తెలంగాణ నేతలు నరకం చూస్తున్నారని అన్నారు. రానున్న రోజుల్లో ఆశ్చర్యపోయే చేరికలు ఉంటాయని తెలిపారు. ఈటెల రాజేందర్ చాలా మంచి వ్యక్తి అని..కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా కాంగ్రెస్ వ్యక్తేనని అన్నారు. మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ దుర్మార్గుడని మండిపడ్డారు.
కాగా మరికొన్ని గంటల్లో రాహుల్ గాంధీతో పొంగులేటి, జూపల్లి భేటీ అవుతారు. పార్టీలో చేరికపై వారితో చర్చిస్తారు.