Tummala Nageswara Rao : తుమ్మలతో పొంగులేటి భేటీ.. బయటకొచ్చి ఏం అన్నారంటే..
X
ఖమ్మం జిల్లా రాజకీయాలు రోజురోజుకి మరింత ఆసక్తికరంగా మారుతున్నాయి. సీనియర్ నేత, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు బీఆర్ఎస్ పార్టీని వీడటం దాదాపు ఖరారైనట్టుగానే కనిపిస్తోంది. ఇక కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ముహూర్తం నిర్ణయించుకోవడమే తరువాయి అన్నట్టుగా పరిస్థితి కనిపిస్తోంది. ఖమ్మం జిల్లాకు చెందిన కాంగ్రెస్ నేత పొంగులేటి శ్రీనివాసరెడ్డి తాజాగా తుమ్మల నాగేశ్వరరావును కలిశారు. ఖమ్మంలోనికి తుమ్మల నివాసానికి వచ్చిన పొంగులేటి – కాంగ్రెస్ పార్టీలోకి రావాలని ఆయనను ఆహ్వానించారు. ఆయన రాక కోసం తాము ఎదురుచూస్తున్నామని తెలిపారు.
ఈ సందర్భంగా తుమ్మలతో కలిసి పొంగులేటి మీడియాతో మాట్లాడుతూ.. తనను, మంత్రి అజయ్‌ను బీఆర్ఎస్‌లోకి తుమ్మల నాగేశ్వరరావు తీసుకెళ్లారని గుర్తుచేశారు. ప్రజలకు మంచి చేయాలనే బీఆర్ఎస్ లో చేరినట్లు చెప్పారు. అప్పుడు తనను, ఇప్పుడు తుమ్మలను పార్టీ నుంచి వెళ్లగొట్టారని విమర్శించారు. పార్టీ నుంచి పొమ్మనకుండా పొగ పెడుతున్నారని ఆరోపించారు. తుమ్మలను, ఆయన అనుచరులను కాంగ్రెస్‌లోకి ఆహ్వానిస్తున్నట్లు చెప్పారు.
ఇక తుమ్మల ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. అనుచరులు, అభిమానులతో చర్చించి పార్టీ మార్పుపై నిర్ణయం తీసుకుంటానని తుమ్మల తెలిపారు. కాంగ్రెస్ పార్టీ తనను ఆహ్వానించిందని.. అయితే అభిమానుల అభిప్రాయానికనుగుణంగా నడుచుకుంటానన్నారు. ప్రజల సహకారంతో ఖమ్మం జిల్లాను అభివృద్ధి చేసినట్లు తెలిపారు. కాంగ్రెస్‌లో చేరాలని పొంగులేటి ఆహ్వానించారన్నారు. సీతారామ ప్రాజెక్టులోకి గోదావరి జలాల విడుదల చూడాలన్నది తన లక్ష్యమని వివరించారు. సీతారామ ప్రాజెక్టు పూర్తి కోసమే ఎన్నికల్లో పోటీ చేస్తానని స్పష్టం చేశారు.