Ponnala Lakshmaiah: ప్రగతి భవన్లో కేసీఆర్ను కలిసిన పొన్నాల దంపతులు
X
మాజీ మంత్రి, సీనియర్ నేత పొన్నాల లక్ష్మయ్య ఆదివారం సతీసమేతంగా సీఎం కేసీఆర్ ను కలిశారు. ప్రగతి భవన్ లో వారు మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. పొన్నాల దంపతులను సాదరంగా ఆహ్వానించిన కేసీఆర్ వారితో కాసేపు ముచ్చటించారు. వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు.
కాంగ్రెస్లో సరైన గౌరవం దక్కడంలేదంటూ రెండ్రోజుల క్రితం పొన్నాల పార్టీకి రాజీనామా చేశారు. అనంతరం మంత్రి కేటీఆర్ స్వయంగా పొన్నాల నివాసానికి వెళ్లి బీఆర్ఎస్లోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా కేసీఆర్తో భేటీ అనంతరం నిర్ణయం తీసుకుంటానని ఆయన చెప్పినట్లు సమాచారం. ఈ క్రమంలోనే ఇవాళ పొన్నాల ప్రగతి భవన్ వెళ్లి కేసీఆర్ ను కలిసినట్లు తెలుస్తోంది.
పార్టీలో సముచిత స్థానం కల్పిస్తామని కేటీఆర్ ఇప్పటికే పొన్నాలకు హామీ ఇచ్చారు. అక్టోబర్ 16 జనగామలో జరిగే బహిరంగ సభలో పొన్నాల.. సీఎం కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ లో చేరనున్నట్లు తెలుస్తోంది. అయితే జనగామ టికెట్ ఇప్పటికే పల్లా రాజేశ్వర్ రెడ్డికి కన్ఫామ్ చేశారు. ఈ క్రమంలో బీసీ వర్గానికి చెందిన పొన్నాలకు ఏ పదవి ఇస్తారన్నది ఆసక్తికరంగా మారింది.