Prajapalana Applications : నేటితో ముగియనున్న ప్రజాపాలన దరఖాస్తులు
X
సంక్షేమ పథకాల అమలు కోసం కాంగ్రెస్ సర్కారు ప్రారంభించిన ప్రజా పాలన దరఖాస్తుల ప్రక్రియ నేటితో ముగియనుంది. ఐదు గ్యారెంటీల లబ్దిదారులను ఎంపిక చేసేందుకు అభయ హస్తం పేరుతో డిసెంబర్ 28 నుంచి అప్లికేషన్లు స్వీకరిస్తున్నారు. సంక్షేమ పథకాల కోసం శుక్రవారం వరకు కోటి 8 లక్షలకుపైగా (1,08,94,115) దరఖాస్తులు అందాయి. శుక్రవారం ఒక్కరోజే 18,29,274 మంది అభయహస్తం దరఖాస్తులు సమర్పించారు. శనివారం చివరి రోజు కావడంతో పెద్ద సంఖ్యలో అప్లికేషన్లు వచ్చే అవకాశముందని అధికారులు భావిస్తున్నారు. రద్దీకి తగ్గట్లుగా ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేస్తున్నారు.
హైదరాబాద్ నగరంలోని 6 జోన్లలో 600 కేంద్రాలు ఏర్పాటు చేయగా.. శుక్రవారం వరకు 21,52,178 దరఖాస్తులు అందాయి. శుక్రవారం ఒక్క రోజే 1.69లక్షల అభయహస్తం దరఖాస్తులు, 79వేల ఇతర అప్లికేషన్లతో కలుపుకొని 2.48లక్షల అర్జీలను స్వీకరించినట్లు జీహెచ్‌ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రాస్ ప్రకటించారు. ఇప్పటివరకు దరఖాస్తు చేయనివారు చివరి రోజు సభలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. మరోవైపు ప్రభుత్వ ఆదేశాల మేరకు దరఖాస్తుదారుల సమాచారాన్ని కంప్యూటరీకరించే పనులను జీహెచ్ఎంసీ ప్రారంభించింది. శుక్రవారం హెడ్ ఆఫీసులో సర్కిళ్లవారీగా అధికారులు, సమాచారాన్ని నమోదు చేసే ఏజెన్సీలకు ట్రైనింగ్ ఇచ్చారు. యూజర్ ఐడీ, పాస్‌వర్డ్‌లను వినియోగించే విధానం, సమాచారాన్ని ఆన్‌లైన్ ఫాంలలో ఎలా నింపాలనే అంశాలపై అవగాహన కల్పించారు.
ఇదిలా ఉంటే ప్రజాపాలన దరఖాస్తుల గడువు పెంచేది లేదని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఇంకా దరఖాస్తు చేసుకోనివారు అవకాశాన్ని ఉపయోగించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ప్రజా పాలనలో భాగంగా స్వీకరించిన అభయహస్తం దరఖాస్తులను ఈనెల 17లోపు కంప్యూటరీకరించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు ఇటీవలే కలెక్టర్లతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించిన సీఎస్ శాంతి కుమారి ప్రజాపాలన అప్లికేషన్స్ విషయంలో గుడ్ న్యూస్ చెప్పారు. ప్రతి నాలుగు నెలలకోసారి దరఖాస్తుల స్వీకరణ ఉంటుందని చెప్పారు. ప్రస్తుతం అప్లై చేసుకోలేని వారు నాలుగు నెలల తర్వాత మళ్లీ అప్లై చేసుకోవచ్చని చెప్పారు.
ఇక ప్రజాపాలనలో భాగంగా మహాలక్ష్మి, రైతు భరోసా, చేయూత, గృహ జ్యోతి, ఇందిరమ్మ ఇళ్లు మొదలైన పథకాలకు దరఖాస్తులు తీసుకుంటున్నారు. అయితే మహాలక్ష్మి పథకానికి ఎక్కువగా అప్లికేషన్స్ వస్తున్నట్లు అధికారులు చెప్పారు. 100 రోజుల్లోగా హామీ ఇచ్చిన గ్యారెంటీలన్నింటినీ అమలు చేస్తామని కాంగ్రెస్ నాయకులు చెబుతున్నారు.