Pravalika Mother : నా బిడ్డ చావుకు కారణమైనవాడికి ఉరి శిక్ష వేయండి - ప్రవళిక తల్లి
X
రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ప్రవళిక ఆత్మహత్యకు సంబంధించి కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. గ్రూప్ 2 వాయిదా కారణంగానే ఆమె చనిపోయిందంటూ ప్రతిపక్షాలు ఆరోపణల నేపథ్యంలో ప్రవళిక తల్లి విజయ ఇచ్చిన స్టేట్మెంట్ సంచలనంగా మారింది. తన బిడ్డ మృతికి పరీక్షల వాయిదా కారణం కాదని, ఓ యువకుడు తన బిడ్డను వేధించడంతోమే ఆమె ఆత్మహత్య చేసుకుందని స్పష్టం చేసింది. అనవసర రాజకీయాల్లోకి తమ కుటుంబాన్ని లాగొద్దని తమను టార్చర్ పెట్టొద్దని కోరింది.
రెండేండ్లుగా తన కూతురు ప్రవళికను హైదరాబాద్లో చదివిస్తున్నామని, తన కొడుకు కూడా హైదరాబాద్లోనే చదువుకుంటున్నాడని విజయ చెప్పింది. ఎండలో కాయకష్టం చేసి బతుకీడుతున్నామని అలాంటి కష్టం తమ బిడ్డలకు రావద్దని హైదరాబాద్ పంపి బాగా చదివించుకుంటున్నామని చెప్పింది. కానీ ఓ యువకుడు తన బిడ్డను వేధించాడని, అతని టార్చర్ తట్టుకోలేక ఆ బాధ తమతో చెప్పుకోలేక ప్రవళిక ఆత్మహత్య చేసుకుందని వాపోయింది. తన బిడ్డ చావుకు కారణమైన వాడిని కఠినంగా శిక్షించాలని జైలు నుంచి బయటకు రాకుండా చేయాలని డిమాండ్ చేసింది. తన బిడ్డ కష్టం వేరెవరూ రావొద్దని కోరుకుంది.
పార్టీల మధ్య గొడవలుంటే వాళ్లే చూసుకోవాలే తప్ప తమ కుటుంబాన్ని అందులోకి లాగి ఇలా చెప్పండి అలా చెప్పండని, ఇలా చేయండి అలా చేయండని టార్చర్ పెట్టొద్దని విజయ విజ్ఞప్తి చేసింది. దాని వల్ల తమకు వచ్చేదేం లేదని చెప్పింది. తన బిడ్డ ఉరి వేసుకొని ప్రాణాలు తీసుకునేందుకు కారణమైన వ్యక్తికి ఉరి శిక్ష వేయాలని ప్రవళిక తల్లి డిమాండ్ చేసింది.