పాతబస్తీ మెట్రోకు పనులు ప్రారంభం..భూసేకరణకు నోటీసులు జారీ
X
హైదరాబాద్ మెట్రో రైలు విస్తరణకు కసరత్తు ప్రారంభమైంది. పాతబస్తీ వరకు మెట్రో పొడిగింపుకు కేసీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో అధికారులు పనులు ప్రారంభించారు. ఎంజీబీఎస్ నుంచి ఫలక్‌నుమా వరకు సుమారు 5.5 కిలోమీటర్ల మేర మెట్రో విస్తరణకు భూ సేకరణ చేపడుతున్నారు.నెల రోజుల్లో మెట్రో నిర్మాణానికి సంబంధించి భూసేకరణకు నోటీసులు జారీ చేయనున్నట్లు మెట్రో ఎండీ ఎన్‌వీఎస్ రెడ్డి తెలిపారు.
ఆదివారం మీడియాతో మాట్లాడిన ఆయన పాతబస్తీ మార్గంలో 103 మతపరమైన నిర్మాణాలు ఉన్నాయని చెప్పారు. వాటిలో నాలుగు మతపరమైన నిర్మాణాల విషయంలో సమస్యలున్నాయన్నారు. వాటిని కాపాడేందుకు ఇంజినీరింగ్ పరిష్కారాలు జరుగుతున్నాయని వివరించారు.
పాత బస్తీ మెట్రో ఎంజీబీఎస్ నుండి దారుల్షిఫా జంక్షన్ – పురానీ హవేలీ – ఇత్తెబార్ చౌక్ – అలీజాకోట్ల – మీర్ మోమిన్ దైరా – హరిబౌలి – శాలిబండ – శంషీర్‌గంజ్, అలియాబాద్ మీదుగా ఫలక్‌నుమా వరకు మెట్రో రైలు ఉంటుంది. ఈ మార్గంలో సాలార్‌జంగ్ మ్యూజియం, చార్మినార్, శాలిబండ, షంషీర్‌గంజ్, ఫలక్‌నుమా స్టేషన్లు ఉండనున్నాయి. మెట్రో స్టేషన్లు సాలార్‌జంగ్ మ్యూజియం, చార్మినార్‌లకు 500 మీటర్ల దూరంలో ఉన్నప్పటికీ.. ఈ రెండు స్టేషన్‌లకు హైదరాబాద్‌లో ఉన్న ప్రాముఖ్యత దృష్ట్యా వాటి పేరు పెట్టడం జరిగిందని మెట్రో ఎండీ ఎన్‌వీఎస్ రెడ్డి తెలిపారు.