Home > తెలంగాణ > ఫామ్‌హౌస్ నుంచి నడుస్తున్న ఏకైక ప్రభుత్వం.. ప్రియాంక గాంధీ

ఫామ్‌హౌస్ నుంచి నడుస్తున్న ఏకైక ప్రభుత్వం.. ప్రియాంక గాంధీ

ఫామ్‌హౌస్ నుంచి నడుస్తున్న ఏకైక ప్రభుత్వం.. ప్రియాంక గాంధీ
X

ఫామ్‌హౌస్ నుంచి నడుస్తున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణ మాత్రమేనంటూ.. కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ బీఆర్ఎస్‌పై సంచలన ఆరోపణలు చేశారు. పదేళ్లుగా తెలంగాణలో బీఆర్ఎస్ సర్కార్ ఉందని, ఆ ప్రభుత్వంలో కేసీఆర్ కుటుంబానికి మాత్రమే ఉద్యోగాలు దొరికాయని ఎద్దేవా చేశారు. మంగళవారం జహీరాబాద్ లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ప్రియాంక గాంధీ.. ఓటర్లనుద్దేశించి మాట్లాడారు. ఇది ఎన్నికల సమయమని, ఆలోచించి ఓటు వేయాలని పిలుపునిచ్చారు.

బీఆర్ఎస్ ఇచ్చిన ప్రతీ మాట తప్పిందన్నారు ప్రియాంక. తెలంగాణ ప్రజల కలలకు బీఆర్ఎస్ తూట్లు పొడిచిందన్నారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో సామాన్యులు ధరల భారంతో తల్లడిల్లుతున్నారని, తెలంగాణ ఆడబిడ్డలకు బీఆర్ఎస్ ఏమైనా చేసిందా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో మహిళలపై దాడులు, అత్యాచారాలు పెరిగాయన్నారు. ఉద్యోగాల కోసం తెలంగాణ తెచ్చుకుంటే అదీ నెరవేరలేదని, ఉద్యోగ పరీక్షల పేపర్లు లీక్‌ చేసి అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. రుణమాఫీ చేస్తామని రైతులకిచ్చిన హామీ అమలు చేయలేదన్నారు. సాగునీటి ప్రాజెక్టుల్లో ఈ ప్రభుత్వం భారీగా అవినీతికి పాల్పడిందన్నారు. ఛత్తీస్‌గడ్ లో రైతులు చాలా సంతోషంగా ఉన్నారని.. ఉపాధి కోసం వలస వెళ్లిన వాళ్లు తిరిగొస్తున్నారని చెప్పారు. కర్నాటకలో మహిళలకు ఉచిత బస్సు సదుపాయం కల్పిస్తున్నామని.. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలో కి రాగానే ఇక్కడ కూడా ఆ పథకాన్ని అమలుచేస్తామని చెప్పారు. రాజస్థాన్ లో ఇచ్చినట్టు ఇక్కడా ఉద్యోగాలిస్తామని చెప్పారు.

దేశంలో అత్యంత సంపన్న పార్టీ బీజేపీ, తెలంగాణలో అత్యంత సంపన్న పార్టీ బీఆర్ఎస్ అని ఆరోపణలు చేస్తూ.. ఈ పార్టీలకు అంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందని ప్రశ్నించారు. ఆ డబ్బు అంతా ప్రజలదేనన్నారు. కాంగ్రెస్ లో అహంకారానికి తావు లేదని, కాంగ్రెస్ అంటే అణువణువునా సేవాభావమేనన్నారు.

Updated : 28 Nov 2023 12:55 PM IST
Tags:    
Next Story
Share it
Top