Car Stolen: దిల్ రాజు అల్లుడి కారు చోరీ.. దొంగ మాటలకు పోలీసుల షాక్
X
ప్రముఖ నిర్మాత దిల్‌రాజు అల్లుడు అర్చిత్ రెడ్డికి చెందిన కారు చోరీకి గురైంది. రూ. 1.7 కోట్ల విలువైన పోర్షే కారు కన్పించకపోవడంతో ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు గంటలోనే కారును గుర్తించి.. దొంగను అదుపులోకి తీసుకున్నారు. అర్చిత్‌రెడ్డి శుక్రవారం ఉదయం జూబ్లీహిల్స్‌లోని దసపల్లా హోటల్‌కు తన పోర్షే కారులో వెళ్లారు. అక్కడ తన కారును బయటే పార్కింగ్ చేసి వెళ్లిన అర్చిత్ రెడ్డి అరగంట తర్వాత తిరిగొచ్చి చూసేసరికి కారు కనిపించలేదు.
అర్చిత్ రెడ్డి వెంటనే జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు నగరంలోని ట్రాఫిక్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. పలు సీసీ కెమెరాలను పరిశీలించగా జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు వద్ద కారు సిగ్నల్ జంప్ చేసినట్లు గుర్తించారు. దీంతో కేబీఆర్ పార్క్ వద్ద ఉన్న ట్రాఫిక్ పోలీసులను అప్రమత్తం చేయడంతో కారు దొరికింది. అయితే కారు దొంగలించిన వ్యక్తి చెప్పిన మాటలు విని పోలీసులు కంగుతిన్నారు.
కారు దొంగలించిన వ్యక్తి తాను ఆకాశ్ అంబానీ పీఏ అని.. కేటీఆర్ కారు తీసుకెళ్లాలని సూచించడంతో ఈ కారు తీసుకెళ్తున్నట్లు పోలీసులకు చెప్పాడు. తన అసిస్టెంట్ హృతిక్ రోషన్‌తో కలిసి కారులో అత్యవసరంగా అకాశ్ అంబానీని కలవడానికి వెళ్లాల్సివుందని.. వదిలేయాలని పోలీసులకు తెలిపారు. దీంతో పోలీసులకు ఏం చేయాలో అర్థం కాక తలలుపట్టుకున్నారు. అతని కుటుంబ సభ్యులకు ఫోన్ చేయగా మతిస్థిమితం లేదని చెప్పినట్లు పోలీసులు వివరించారు. నిందితుడిని మన్సూరాబాద్ ప్రాంతానికి చెందిన మల్లెల సాయికిరణ్‌గా గుర్తించారు.