బీఆర్ఎస్ పాలనలో జరిగిన విధ్వంసం.. మునుపెన్నడూ చూడలేదు
X
బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో జరిగిన విధ్వంసం మునుపెన్నడూ చూడలేదని అన్నారు టీజేఎస్ అధ్యక్షులు, ప్రొఫెసర్ కోదండరాం. హైదరాబాద్, బేగంపేట లోని ది హరిత ప్లాజాలో.. తెలంగాణ తహశీల్దార్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రెవెన్యూ వ్యవస్థ బలోపేలంపై జరిగిన కార్యక్రమం జరిగింది. దానికి ముఖ్య అతిథిగా కోదండరాం, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళి హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన కోదండరాం.. న్యాయాన్ని పక్కనబెట్టి సొంతానికి పాలన చేస్తే ధరణి లాగా ఉంటుందన్నారు ఆయన. బీఆర్ఎస్ పాలకులు ధరణి పోర్టర్ పేరుతో ఇష్టాను సారంగా భూములను తమ పేరిట రాయించుకోవాలని చూశారని కోదండరాం ఆరోపించారు.
ఇకనైనా పేదలకు మేలు చేసే విధంగా చట్టాలు రావాలని కోరారు. గ్రామ స్థాయి నుంచి ప్రభుత్వం యంత్రాంగం ఉండాలని, నియమాలు, తప్పులు దొర్లకుండా ఉండాలని అభిప్రాయపడ్డారు కోదండరాం. రావణుడి చేతిలో సీత బందీ అయినట్లు.. బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ పదేళ్లు బందీ అయిందని విమర్శించారు. కేసీఆర్ సింహాసనం, ఆయన ఫామ్ హౌస్ లో భాగాన్ని ప్రజలెవరూ అడగలేదని చెప్పారు. రానున్న కాలంలో అంతా కలిసి చట్టబద్దంగా పనిచేయాలని కోదండరాం పిలుపునిచ్చారు. పదవులకోసం కాదు.. ప్రజలకోసం పనిచేయాలని సూచించారు.