MODI: పాలమూరులో నేడు మోదీ సభ.. ఫ్లెక్సీలతో షాకిచ్చారు..
X
ప్రధాని నరేంద్ర మోదీ ఒకరోజు పర్యటన కోసం ఆదివారం తెలంగాణకు రానున్నారు. హైదరాబాద్‌లో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న తర్వాత మహబూబ్ నగర్ వెళ్లి బీజేపీ బహిరంగ సభలో పాల్గొంటున్నారు. ప్రధాని పర్యటన సందర్భంగా పాలమూరులో నిరసనలు ఎదురయ్యే పరిస్థితి కనిపిస్తోంది. ప్రధాని ఈ ప్రాంతానికి ద్రోహం చేశారంటూ కొందరు విమర్శిస్తూ పోస్టర్లు వేస్తున్నారు. మోదీకి తెలంగాణలో పర్యటించే హక్కులేదని అంటున్నారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పిస్తామని హామీ ఇచ్చిన బీజేపీ తర్వాత ఆ సంగతి మర్చిపోయిందని ఫ్లెక్సీలు, పోస్టర్లతో తీవ్ర విమర్శలు సంధిస్తున్నారు. నిజామాబాద్ పసుపు బోర్డు, కాజీపేట్ రైలు బోగీలు, బయ్యారం ఉక్కు వంటి అనేక హామీలను మోదీ ప్రభుత్వం తుంగలో తొక్కిందని పోస్టర్లతో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. మోదీని రావణాసురుడిలా మార్చిన బ్యానర్ శంషాబాద్‌లో కలకలం రేపుతోంది.
‘‘ఆంధ్రప్రదేశ్‌లోని పోలవరం ప్రాజెక్టుకు, కర్ణాటకలో అప్పర్ భద్ర ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించారు. తెలంగాణలోని పాలమూరు ప్రాజెక్టుకు ఎందుకు ఇవ్వలేదు? గోబ్యాక్ మోదీ. తెలంగాణపై మోదీది సవతితల్లి ప్రేమ. ఆయన రాష్ట్రంలో పర్యటించే నైతిక హక్కు లేదు’’ అని విమర్శిస్తున్నారు. నిజామాబాద్ పసుపు బోర్డు కలను సాకారం చేస్తామన్న బీజేపీ ఆ హామీని కూడా అటకెక్కించిదని పోస్టర్లు వేశారు. ఐటీఐఆర్, కాజీపేట రైలు బోగీల పరిశ్ర, టెక్స్‌టైల్ పార్క్, డిఫెన్స్ కారిడార్లను ఎప్పుడూ పూర్తి చేస్తారని ప్రశ్నిస్తున్నారు.
కాగా, మోదీ బేగంపేట విమానాశ్రయం చేరుకున్న తర్వాత 1.45 నుంచి 2.15 మధ్య పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. సివిల్ ఏవియేషన్ రీసెర్చ్ సెంటర్ ప్రారంభిస్తారు. తర్వాత జాతీయ రహదారులు, రైల్వే ప్రాజెక్టులకు శంకుస్థాపన చేస్తారు. మహబూబ్ నగర్‌లో మధ్యాహ్నం 3.15 నుంచి 4.15 వరకు జరిగే బీజేపీ సభలో ప్రసంగిస్తారు. పాలమూరు సభకు లక్ష మందిని తరలించాలని బీజేపీ ఏర్పాట్లు చేస్తోంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు నగరా త్వరలో మోగనున్న నేపథ్యంలో మోదీ రాష్ట్రానికి వస్తున్నారు.