ట్రాన్స్జెండర్లకు చేయూత.. మేమున్నాం అంటూ
X
సమాజంలో ట్రాన్స్ జెండర్స్ కు ఎదురయ్యే సమస్యలు వర్ణణాతీతం. ఎక్కడికి వెళ్లినా సూటిపోటి మాటలు, చులకన చూపులు వాళ్లను వెంటాడుతుంటాయి. తలెత్తుకుని తిరగలేని పరిస్థితి. బయట ఎక్కడా పని దొరకదు. ఇలాంటి సమస్యల నడుమ బతికే వాళ్లకు తోడుగా నిలిచేందుకు రాచకొండ పోలీస్ కమీషనరేట్ కౌన్సిలింగ్ సెంటర్ ఏర్పాటు చేశారు. ట్రాన్స్ జెండర్ల సమస్యల పరిష్కారం, ఉపాది కల్పన కోసం ఈ సెంటర్ పనిచేస్తుంది. రాచకొండ పోలీస్ కమీషనరేట్ ఆధ్వర్యంలో ప్రజ్వల సంస్థ సహకారంతో ప్రత్యేక కౌన్సిలింగ్ సెంటర్ వికల్ప్ ఏర్పాటయింది. దీన్ని డీజీపీ అంజనీ కుమార్, డీఎస్ చౌహాన్ తదితరులు కలిసి మీర్ పేట్ పోలీస్ స్టేషన్లో ప్రారంభించారు.
ఆరోగ్యకరమైన, నేర రహిత సమాజ నిర్మాణానికి ఇలాంటి కౌన్సెలింగ్ సెంటర్లు ప్రారంభించడం అభినందనీయం అని డీజీపీ అంజనీ కుమార్ అన్నారు. వికల్ప్ ద్వారా ట్రాన్స్ జెండర్లకు ఉపాధి అవకాశాలు కల్పించడానికి కృషి చేస్తామని అన్నారు. ఇది ట్రాన్స్ జెండర్ల జీవితాల్లో మార్పు తీసుకొస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.