ప్రభుత్వ బడుల్లో టిఫిన్.. 3 రోజులు గుడ్లు, 3 రోజులు రాగిజావ..
X
రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు టిఫిన్ రూపంలో పౌష్టికాహారం అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా వారంలో మూడు రోజులు కోడిగుడ్డు, మరో మూడు రోజులు రాగిజావ అందించనున్నట్లు పాఠశాల విద్యాశాఖ ప్రకటించింది. సాధారణ రాగిజావ కాకుండా ఫోర్టిఫైడ్ జావ అందించాలని నిర్ణయించింది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ దేవసేన ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నెల 20న రాగిజావ పంపిణీ కార్యక్రమం ప్రారంభించనున్నారు. జులై 1 నుంచి రాష్ట్రంలోని 28,606 పాఠశాలల్లో పూర్తిస్థాయిలో రాగిజావ, కోడిగుడ్డు అందజేయనున్నారు.
ఈ నెల 20న ఒక్కో జిల్లాల్లో 5వేల మంది విద్యార్థులకు రాగిజావను అందజేయనున్నారు. ఇందుకోసం రాగి జావ, బెల్లం పౌడర్లను వేర్వేరుగా జిల్లాలకు చేరవేయనున్నారు. అక్కడి నుంచి పాఠశాలలకు చేర్చేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని డీఈవోలను ఆదేశించారు. ఒక్కో విద్యార్థికి 10 గ్రాముల రాగిపౌడర్, 10 గ్రాముల బెల్లం చొప్పున వారంలో మూడు రోజుల ఇవ్వనున్నారు. కోడిగుడ్లను అందజేసే రోజులను మినహాయించి మిగిలిన రోజుల్లో రాగిజావను పంపిణీ చేస్తారు. మధ్యాహ్న భోజన కుక్ కమ్ హెల్పర్లతో ఈ జావ తయారు చేయించనున్నారు.