Telangana Elections 2023: ప్రచార జోరు పెంచనున్న కాంగ్రెస్.. ఈ వారంలో రాష్ట్రానికి రాహుల్, ప్రియాంక..
X
తెలంగాణలో పొలిటికల్ హీట్ పెరిగింది. ఎన్నికలకు మరికొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉండటంతో రాజకీయపార్టీలన్నీ ప్రచారం ముమ్మరం చేశాయి. కాంగ్రెస్ సైతం ఈ నెల 18 నుంచి బస్సు యాత్రకు సిద్ధమైంది. ఈ క్రమంలో కాంగ్రెస్ అగ్రనేతలైన రాహుల్, ప్రియాంక గాంధీలు రాష్ట్రానికి రానున్నారు. దాదాపు 3 రోజుల పాటు వారు ప్రచారం చేయనున్నారు.
రాహుల్ గాంధీ, పార్టీ జనరల్ సెక్రటరీ ప్రియాంకా గాంధీ అక్టోబర్ 18,19,20 తేదీల్లో తెలంగాణలో పర్యటించనున్నారు. ఈ విషయాన్ని రాష్ట్ర కాంగ్రెస్ ఇన్‌ఛార్జి మాణిక్‌రావు ఠాక్రే వెల్లడించారు. అక్టోబర్ 18న రాహుల్ గాంధీ ములుగు నుంచి కాంగ్రెస్ బస్సు యాత్రను ప్రారంభించనున్నారు. అనంతరం పెద్దపల్లిలో జరిగే భారీ బహిరంగ సభలో ఆయనతో పాటు ప్రియాంక గాంధీ పాల్గొంటారు. కరీంనగర్ లో నిర్వహించే పాదయాత్ర, బహిరంగ సభలోనూ వాళ్లిద్దరూ పాలు పంచుకోనున్నారు.
రాహుల్ గాంధీ జగిత్యాలలో రైతులతో మాట్లాడతారని, నిజామాబాద్‌లో పాదయాత్ర, బహిరంగ సభలో పాల్గొంటారని మాణిక్ రావ్ ఠాక్రే ప్రకటించారు. ఆర్మూర్ రైతులతోనూ రాహుల్ ముచ్చటించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా కొనసాగనున్న ఈ బస్సు యాత్రలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డితో పాటు పార్టీ ముఖ్యనేతలు, స్థానిక నేతలు పాల్గొంటారు.