మోడీని ఓడించాలంటే.. ముందు కేసీఆర్‌ను ఓడించాలి.. రాహుల్ గాంధీ
X
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు చివరి రోజు ప్రచారంలో కాంగ్రెస్ నేతలు స్పీడ్ పెంచారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ.. నాంపల్లిలో కాంగ్రెస్ బహిరంగ సభలో పాల్గొన్నారు. ఈ క్రమంలో బీజేపీ, బీఆర్‌ఎస్‌పై విరుచుకుపడ్డారు. బీజేపీని ప్రశ్నించినందుకే తనపై దేశవ్యాప్తంగా 24 కేసులు పెట్టారని ఆరోపించారు. తనపై పరువు నష్టం కేసు కూడా వేశారని, లోక్‌సభ సభ్యత్వాన్ని కూడా రద్దు చేశారన్నారు. వివాదాస్పద వ్యాఖ్యలే అందుకు కారణమైనట్లయితే.. ఒవైసీపై ఎన్ని కేసులు ఉన్నాయని, ఓవైసీ సభ్యత్వం ఎందుకు రద్దు చేయలేదని ప్రశ్నించారు.
దేశంలో బీజేపీ విభజన రాజకీయాలు చేస్తోందన్నారు రాహుల్. కాంగ్రెస్, బీజేపీ పోటీచేసే రాష్ట్రాల్లోనే.. ఓట్లు చీల్చేందుకు ఎంఐఎం వస్తుందన్నారు. ఎంఐఎం పోటీచేసే స్థానాలను నిర్ణయించేది బీజేపీనే అని, బీజేపీ ఇచ్చిన లిస్ట్‌తో తమ అభ్యర్థులను ఎంఐఎం ప్రకటిస్తుందని చెప్పారు. బీజేపీ, ఎంఐఎం, బీఆర్‌ఎస్ మూడు పార్టీలు కలిసి పనిచేస్తాయని.. కేంద్రంలో మోదీని ఓడించాలంటే ముందు తెలంగాణలో కేసీఆర్‌ను ఓడించాలన్నారు. తెలంగాణలో నడుస్తున్నది దొరల సర్కారు అని, ప్రజల సర్కారును కాంగ్రెస్ తీసుకువస్తుందని చెప్పారు. హైదరాబాద్‌లో మెట్రో, ఎయిర్‌పోర్టు నిర్మించింది కాంగ్రెస్ హయాంలోనేనని చెప్పారు.కేసీఆర్ దోచుకున్న ప్రజల సొమ్మును తిరిగి ప్రజలకు పంచబోతున్నామన్నారు. కేసీఆర్ కు బై బై చెప్పాల్సిన సమయం వచ్చిందన్నారు. బీజేపీ బీసీ వ్యక్తిని సీఎం చేస్తామంటోందని ముందు ఆపార్టీ 2 శాతం ఓట్లు తెచ్చుకోవాలన్నారు. ప్రస్తుతం కాంగ్రెస్‌కు బీఆర్ఎస్‌తోనే పోటీ అన్నారు.