Home > తెలంగాణ > పరువునష్టం కేసులో రాహుల్‌ గాంధీకి ఎదురుదెబ్బ

పరువునష్టం కేసులో రాహుల్‌ గాంధీకి ఎదురుదెబ్బ

పరువునష్టం కేసులో రాహుల్‌ గాంధీకి ఎదురుదెబ్బ
X

పరువునష్టం కేసులో కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీకి ఎదురుదెబ్బ తగిలింది. 'మోదీ ఇంటిపేరు’పై చేసిన వ్యాఖ్యలకు సంబంధించి.. సూరత్ ట్రయల్ కోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ ఆయన దాఖలు చేసిన పిటిషన్‌ను గుజరాత్ హైకోర్టు కొట్టేసింది. సూరత్ కోర్టు తనకు విధించిన శిక్షను నిలిపివేయాలంటూ వేసిన పిటిషన్ పై స్టే ఇచ్చేందుకు గుజరాత్ హైకోర్టు నిరాకరిచింది. ఈ కేసులో సెషన్స్‌ కోర్టు ఇచ్చిన తీర్పును ఉన్నత న్యాయస్థానం సమర్థించింది.

కాగా, మోడీ ఇంటిపేరు వ్యాఖ్యల పరువు నష్టం దావా కేసులో సూరత్ ట్రయల్ కోర్టు ఈ ఏడాది మార్చి 23న రాహుల్ గాంధీని దోషిగా తేల్చింది. అంతేకాకుండా రెండేళ్ల జైలు శిక్ష విధించింది.దీంతో రాహుల్ గాంధీ తన పార్లమెంట్ సభ్యత్వాన్ని కోల్పోయారు. దోషిగా నిర్థరణ అయిన వ్యక్తి చట్టసభల సభ్యునిగా కొనసాగడానికి చట్టం అంగీకరించదు కాబట్టి ఆయన వయనాద్ లోక్‌సభ సభ్యత్వానికి అనర్హుడని లోక్‌సభ సచివాలయం మార్చి 24న ప్రకటించింది. ఈ కోర్టు తీర్పు అమలును నిలుపుదల చేయాలని కోరుతూ రాహుల్ గాంధీ సూరత్ సెషన్స్ కోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌ను సెషన్స్ కోర్టు ఏప్రిల్ 20న తిరస్కరించింది. దీంతో ఆయన ఏప్రిల్ 25న గుజరాత్ హైకోర్టును ఆశ్రయించారు.

ఈ తీర్పుపై స్టే ఇవ్వాలని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కాగా, దీనిపై ఇవాళ విచారణ చేపట్టిన హైకోర్టు స్టే ఇచ్చేందుకు నిరాకరిస్తూ కీలక తీర్పు వెలువరించింది. సూరత్ ట్రయల్ కోర్టు తీర్పుపై హైకోర్టు స్టే ఇస్తే.. రాహుల్ గాంధీ పార్లమెంట్ సభ్యత్వం తిరిగి పునరుద్ధరించబడేది. కానీ, దీనికి గుజరాత్ హైకోర్టు నిరాకరించడంతో రాహుల్ గాంధీకి మరోసారి తీవ్ర నిరాశే ఎదురైంది. ఇక ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించవలసి ఉంటుంది.



Updated : 7 July 2023 12:13 PM IST
Tags:    
Next Story
Share it
Top