Home > తెలంగాణ > కాంగ్రెస్ వల్లే కేసీఆర్కు పాలించే అవకాశం : రాహుల్

కాంగ్రెస్ వల్లే కేసీఆర్కు పాలించే అవకాశం : రాహుల్

కాంగ్రెస్ వల్లే కేసీఆర్కు పాలించే అవకాశం : రాహుల్
X

కాంగ్రెస్ వల్లే కేసీఆర్కు పాలించే అవకాశం వచ్చిందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. కానీ కేసీఆర్ పాలనలో అన్ని వర్గాల ప్రజలు ఆగమయ్యారని చెప్పారు. సంగారెడ్డిలో కాంగ్రెస్ అభ్యర్థి జగ్గారెడ్డికి మద్ధతుగా రాహుల్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ ఎన్నికలు దొరల తెలంగాణ, ప్రజల తెలంగాణకు మధ్య జరుగుతున్నాయని అన్నారు. గత పదేళ్లలో బీఆర్ఎస్ సర్కార్ ఏం చేసిందని ప్రశ్నించారు. ధరణి పోర్టల్‌ పేరుతో ప్రజల భూములను నేతలు లాక్కున్నారని ఆయన ఆరోపించారు. బీఆర్ఎస్ పాలనలో రాష్ట్రంలో 8వేల మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని చెప్పారు.

కేసీఆర్ సర్కార్ నిరుద్యోగులను పట్టించుకోలేదని రాహుల్ ఆరోపించారు. పేపర్ లీకేజీతో యువత ఎంతో నష్టపోయారని అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేస్తామని చెప్పారు. కాంగ్రెస్ను ఓడించడమే బీఆర్ఎస్, బీజేపీల లక్ష్యమన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో రూ.లక్ష కోట్ల అవినీతి జరిగిందని.. అయినా కేంద్రం ఎటువంటి చర్యలు తీసుకోలేదన్నారు. ప్రధాని మోదీ, కేసీఆర్‌ కలిసి ప్రజల జేబుల్లోని డబ్బును దోచుకుంటున్నారని మండిపడ్డారు.

కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఆరు గ్యారెంటీలను అమలుచేస్తామని రాహుల్ తెలిపారు. తొలి కేబినెట్ లోనే వాటికి ఆమోదముద్ర వేస్తామన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణంతో పాటు నెలకు 2500 అందజేస్తామని చెప్పారు. రైతులకు రూ. 15వేలు, రైతు కూలీలకు రూ. 12వేలు అందజేస్తామన్నారు. అలాగే వ్యవసాయానికి 24గంటలు నాణ్యమైన ఉచిత కరెంట్ ఇస్తామన్నారు. వితంతువులు, వికలాంగులకు రూ. 4000 పెన్షన్ ఇస్తామని చెప్పారు. ఇవన్నీ జరగాలంటే జగ్గారెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.

Updated : 26 Nov 2023 4:31 PM IST
Tags:    
Next Story
Share it
Top