2శాతం ఓట్లతో సీఎంను ఎలా చేస్తారు..? బీజేపీకి రాహుల్ గాంధీ సటైర్
X
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ - కాంగ్రెస్ మధ్య యుద్ధం జరుగుతోందని రాహుల్ గాంధీ అన్నారు. కల్వకుర్తిలో జరిగిన ప్రజాభేరి సభలో పాల్గొన్న ఆయన.. బీఆర్ఎస్,బీజేపీ, ఎంఐఎం పార్టీలు కలిసి పనిచేస్తున్నాయని ఆరోపించారు. అందుకే పార్లమెంటులో బీజేపీకి బీఆర్ఎస్ పార్టీ సంపూర్ణ మద్దతు ఇస్తోందని విమర్శించారు. రైతు చట్టాలు, జీఎస్టీ, నోట్ల రద్దు విషయంలో కేసీఆర్ మోడీని సపోర్ట్ చేశారని రాహుల్ చెప్పారు.
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ సర్కారు ప్రతిపక్షాలను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తోందని రాహుల్ మండిపడ్డారు. తనపై 24 కేసులు పెట్టారని, లోక్ సభ సభ్యత్వాన్ని రద్దు చేసి ప్రభుత్వం తనకు కేటాయించిన ఇంటి కూడా లాక్కున్నారని ఆరోపించారు. కానీ కేసీఆర్ విషయంలో మాత్రం మోడీ సర్కారు చూసీచూడనట్లు వ్యవహరిస్తోందని, అందుకే ఆయనపై సీబీఐ ఎంక్వైరీ ఉండదని, ఈడీ అధికారులు వారి ఇంటి ముందుకు వెళ్లరని అన్నారు.
తెలంగాణలో అధికారంలోకి వస్తామని ధీమాతో ఉన్న బీజేపీ గాలి తీసేశామని రాహుల్ గాంధీ అన్నారు. ఓబీసీ నేతను ముఖ్యమంత్రిని చేస్తామని కమలం పార్టీ నేతలు చెబుతున్నారని, కానీ 2శాతం ఓట్లతో తమ పార్టీ వారిని సీఎం ఎలా చేస్తారని ప్రశ్నించారు. కాంగ్రెస్ పోటీ చేసే ప్రతి చోటా ఎంఐఎం అభ్యర్థులు ప్రత్యక్షమవుతారని, వారంతా డబ్బు తీసుకొని బీజేపీకి సాయం చేసేందుకే వస్తారని ఆరోపించారు. తెలంగాణ, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్ఘడ్ రాష్ట్రాల్లో విజయం ఖాయమని ధీమా వ్యక్తం చేసిన రాహుల్ గాంధీ... కేంద్రంలోనూ అధికారం చేపడతామని స్పష్టం చేశారు. ప్రజలంతా కలిసి తొలుత బీఆర్ఎస్ ను ఓడించాలని ఆ తర్వాత కేంద్రంలో మోడీని సాగనంపాలని పిలుపునిచ్చారు.