రాహుల్‌గాంధీకి మళ్లీ షాక్.. మరో పరువు నష్టం కేసు
X
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై కర్ణాటకలో మరో పరువునష్టం కేసు నమోదైంది. రాహుల్‌గాంధీతో పాటు కర్ణాటక సీఎం సిద్ధరామయ్య,(CM Siddaramaiah), డిప్యూటీ డీకే శివకుమార్‌లకు(DK Shivakumar) చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ సమన్లు జారీ చేసింది. కర్ణాటక ఎన్నికల సందర్భంగా ఈ ముగ్గురూ ఇంతకుముందు అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారంటూ కర్ణాటక రాష్ట్ర బీజేపీ సెక్రటరీ కేశవ ప్రసాద్.. పరువు నష్టం కేసు వేశారు. మే 9 న నమోదైన ఈ పరువు నష్టం కేసులో చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్.. తాజాగా రాహుల్ గాంధీ, సిద్ధరామయ్య, డీకే శివకుమార్‌లకు సమన్లు జారీ చేసింది. ఈ కేసు జూలై 27న విచారణకు రానుంది.
ఇటీవల ముగిసిన అసెంబ్లీ ఎన్నిలకు ముందు బీజేపీ ప్రభుత్వం.. 40 శాతం అవినీతికి పాల్పడిందని, గత నాలుగేళ్లలో రూ.1.50 లక్షల కోట్లు కొల్లగొట్టిందని సదరు కాంగ్రెస్ నేతలు ఆరోపణలు చేశారంటూ కేశవ ప్రసాద్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. రాహుల్‌గాంధీ చేసిన ఆరోపణలు నిరాధారమైనవి.. పరువు నష్టం కలిగించేవిగా ఉన్నాయని.. అటువంటి ప్రచారం కారణంగానే గత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఓటమి పాలైందని చెప్పుకొచ్చారు. ఈ ఆరోపణలపైనే ఆయన పరువు నష్టం కేసు దాఖలు చేశారు. గతంలో మోడీ ఇంటిపేరు చేసిన వ్యాఖ్యల కారణంగా.. పరువు నష్టం కేసులో దోషిగా తేలిన రాహుల్ గాంధీ ఇప్పటికే లోక్‌సభ సభ్యత్వం కోల్పోయారు. కాగా మళ్లీ ఆయనపై మరో పరువునష్టం కేసు నమోదైంది.