నేడే కాంగ్రెస్ 'తెలంగాణ జనగర్జన సభ’.. హాజరుకానున్న రాహుల్ గాంధీ
'జనగర్జనను ఎవరూ అడ్డుకోలేరు'!!
X
త్వరలోనే తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల యుద్ధం మొదలుకాబోతుంది. ఇప్పటికే ప్రధాన పార్టీలన్నీ రాబోయే ఎన్నికల్లో గెలుపే తమ లక్ష్యంగా పావులు కదుపుతున్నాయి. అన్నీ పార్టీల్లోనూ చేరికలు, మార్పులు జరుగబోతున్నాయి. ఇక ఈసారి ఎలాగైనా రాష్ట్రంలో అధికారంలోకి రావాలని భావిస్తున్న కాంగ్రెస్.... కాస్త రూట్ మార్చి.. గతానికి భిన్నంగా అడుగులు వేస్తోంది. ఆపరేషన్ ఆకర్షన్ తో పలువురిని పార్టీలోకి రప్పించే పనిలో ఉంది. ఇప్పటికే పొంగులేటి, జూపల్లితో పాటు ఇతర నేతలను పార్టీలోకి రప్పించటంలో సక్సెస్ అయింది. పొంగులేటి చేరికతో పాటు భట్టి పాదయాత్ర ముగింపు సభ సందర్భంగా... ఇవాళ ఖమ్మం వేదికగా భారీ సభను తలపెట్టింది. ఇదే వేదిక నుంచి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల శంఖారావం పూరించాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. ఈ సభకు తెలంగాణ జన గర్జన అనే పేరు పెట్టింది
ఆదివారం సాయంత్రం ఖమ్మం వేదికగా జరిగే ఈభారీ బహిరంగ సభకు పార్టీ అగ్రనేత రాహుల్‌గాంధీ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ఈ సభకోసం.. రాహుల్ ముందుగా విజయవాడ చేరుకోనున్నారు. ఆ తర్వాత ఖమ్మం రానున్నారు. సాయంత్రం జరగబోయే ఈ సభకు ఖమ్మం, భద్రాద్రి జిల్లాల్లోని 10 అసెంబ్లీ నియోజకవర్గాలతో పాటు నల్గొండ, సూర్యాపేట, వరంగల్, మహబూబాబాద్, ములుగు జిల్లాల నుంచి కార్యకర్తలు, ప్రజలను తరలించేలా ఆ పార్టీ నాయకులు కసరత్తు చేస్తున్నారు. సుమారు 40 ఎకరాల్లోని సభా వేదికను భారీ స్థాయిలో ఏర్పాటు చేశారు. వేదిక వెనుక భాగంలో 50 అడుగుల ఎల్‌ఈడీ స్క్రీన్ ను ఏర్పాటు చేస్తున్నారు. వేదికకు రెండువైపులా రెండు చొప్పున భారీ ఎల్‌ఈడీ తెరలతో పాటు సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ, మల్లికార్జున ఖర్గే, రేవంత్‌రెడ్డి, భట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీనివాసరెడ్డిల భారీ కటౌట్లు ఏర్పాటు చేశారు. సభా ప్రాంగణం చుట్టూ 15 ఎల్‌ఈడీ స్క్రీన్లన అమర్చుతున్నారు. వేదికపై సుమారు 200 మంది కూర్చునేలా ఏర్పాటు చేశారు. సభా ప్రాంగణం చుట్టూ పార్టీ ముఖ్యనేతల హోర్డింగులు, భారీ ఫ్లెక్సీలు ఆకట్టుకుంటున్నాయి. వేదికకు సమీపంలోనే సుమారు 60 ఎకరాల్లో నియోజకవర్గాలవారీగా పార్కింగ్ ప్రదేశాలు కేటాయించారు.
అయితే ఈ సభకు ప్రజల నుంచి వస్తున్న విశేష స్పందన చూసి తట్టుకోలేక బీఆర్ఎస్ అడుగడుగునా అడ్డంకులు సృష్టిస్తోందని.. మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఆరోపిస్తున్నారు. సభ విఫలం చేయాలని బీఆర్ఎస్ అనుకుంటోందని.. కానీ జనగర్జనను ఎవరూ అడ్డుకోలేరని చెప్పారు. ప్రజల గుండెల్లోంచి పొంగులేటిని, కాంగ్రెస్‌ను ఎవరూ వేరు చేయలేరని చెప్పారు. కాగా పొంగులేటి ఆరోపణలపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ స్పందిస్తూ... సభ విజయవంతం కాదన్న బెంగతోనే పొంగులేటి మతిభ్రమించి మాట్లాడుతున్నారని విమర్శించారు.