హైదరాబాద్ లో పలుచోట్ల వర్షం.. రాష్ట్రంలో 3 రోజుల పాటు వానలు
X
హైదరాబాద్‌లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. మధ్యాహ్నం వరకు భానుడి భగభగలతో అల్లాడిన నగరవాసి ఒక్కసారిగా వాతావరణం చల్లబడటంతో ఊపిరిపీల్చుకున్నారు. ఎండ, ఉక్కపోతతో అల్లాడుతున్న జనానికి వాన రిలీఫ్ ఇచ్చింది. నగరంలోని పలు ప్రాంతాల్లో వర్షం పడింది. ఫిల్మ్ నగర్, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, పంజాగుట్ట, అమీర్‌పేట, కూకట్‌పల్లి, బాలానగర్ తదితర ప్రాంతాల్లో భారీ వర్షం పడింది. బలమైన ఈదురుగాలులు వీయడంతో కొన్ని ప్రాంతాల్లో అధికారులు విద్యుత్ సరఫరా నిలిపివేశారు. రోడ్లపై భారీగా వర్షపు నీరు చేరడంతో ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది.
రానున్న 3 రోజులు తెలంగాణలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. పలు ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పింది. పగటి ఉష్ణోగ్రతలు 39 నుంచి 42 డిగ్రీల వరకు నమోదయ్యే అవకాశం ఉందని అధికారులు ప్రకటించారు. హైదరాబాద్ చుట్టుపక్కల జిల్లాల్లో పగటి గరిష్ఠంగా 41 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతాయని, రేపు, ఎల్లుండి 30 నుంచి 40 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని ప్రకటించింది.
ఇదిలా ఉంటే నైరుతి రుతుపవనాలు జూన్ 7 నుంచి జూన్ 11 మధ్య తెలంగాణలోకి ప్రవేశించే అవకాశం ఉందనీ, భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ చెప్పింది. జూన్ నెలాఖరు నుంచి రాష్ట్రంపై రుతుపవనాల ప్రభావం ఎక్కువగా ఉంటుందని అధికారులు చెబుతున్నారు. రుతుపవనాలు ప్రవేశించాక వర్షాలు ఎక్కువగా ఉంటాయనీ వాతావరణ శాఖ చెప్పింది.