తెలంగాణకు వర్షసూచన.. వచ్చే ఐదు రోజులు...
X
తెలంగాణలో మరోసారి వానలు దంచికొట్టనున్నాయి. రాష్ట్రంలో రానున్న ఐదు రోజులు వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. బంగాళఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో మోస్తరు లేదా ఉరుములతో కూడిన వర్షాలు పడతాయని అధికారులు చెప్పారు. మేడ్చల్, నల్లగొండ, రంగారెడ్డి, హైదరాబాద్, జనగామ, మహబూబాబాద్, వరంగల్ , హన్మకొండ, భువనగిరి,సూర్యాపేట జిల్లాల్లో వర్షాలు కురుస్తాయన్నారు. ఈ మేరకు ఆయా జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో,గ్రీన్ అలర్ట్‌ను జారీ చేసింది.
రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో శనివారం, ఆదివారం భారీ వర్షం పడింది. కాగా జులైలో దంచికొట్టిన వానలు అగస్ట్లో మాత్రం ఆశించిన స్థాయిలో పడలేదు. గత నెలలో పడిన వర్షాలకు ప్రాజెక్టులు సహా వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. పలు చోట్ల గ్రామాలే నీటమునిగి.. ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఈ నెలలో వర్షాలు సరిగ్గా లేవు. మొన్న రెండు రోజుల పాటు వర్షాలు కురిసినా.. కొన్ని ప్రాంతాల్లోనే పడింది. పలుచోట్ల వానలేక అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు.