Telangana assembly elections 2023: బీఆర్ఎస్కు షాక్.. కాంగ్రెస్లోకి ఇద్దరు ఎమ్మెల్యేలు
X
మూడోసారి అధికారం చేపట్టాలని పట్టుదలతో ఉన్న బీఆర్ఎస్ పార్టీకి వరుస షాక్ లు తగులుతున్నాయి. ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్ది రాజీనామాల పర్వం కొనసాగుతుంది. అసంతృప్తులు, ఆశావహులు కారు దిగి, ఇతర పార్టీల కండువాలు కప్పుకుంటున్నారు. తాజాగా మరో ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పార్టీకి గుడ్ బై చెప్పి.. కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. గత రెండు దఫాలుగా బీఆర్ఎస్ నుండి రెండు సార్లు ఎమ్మెల్యే గా ఎన్నికైన రాథోడ్ బాపురావు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోనున్నారు. బోథ్ సిట్టింగ్ ఎమ్మెల్యేగా టికెట్ వస్తుందని బాపురావు ఆశించగా.. తనను కాదని ప్రస్తుత జెడ్పీటీసీ జాదవ్ అనిల్ కు టికెట్ కేటాయించారు. అప్పటి నుంచి పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్న బాపురావు, కేటీఆర్ తో చర్చలు జరిపినా మౌనంగానే ఉన్నారు. తర్వాత రేవంత్ రెడ్డితో భేటీ అయి.. కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ఒప్పుకున్నారు. అయితే రేవంత్ తనకు ఏ హామీలు ఇచ్చారు, కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు గల కారణాలు మాత్రం తెలియలేదు.
కాగా, బీఆర్ఎస్ టికెట్ దక్కకపోవడంతో అసంతృప్తితో ఉన్న ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖానాయక్ కూడా కారు దిగి.. హస్తం గూటికి చేరుతున్నారు. టికెట్ తనకు ఇచ్చినా ఇవ్వకపోయినా.. కాంగ్రెస్ పార్టీలోనే చేరాలని నిర్ణయం తీసుకున్నారు. తనకు టికెట్ ఇవ్వకుండా భుక్యా జాన్సన్ నాయక్ కు కేటాయించడంపై ఆమె తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బీఆర్ఎస్ అభ్యర్థి ఓటమే లక్ష్యంగా పనిచేస్తానని రేఖా నాయక్ ఇప్పటికే ప్రకటించారు. ఎన్నికల వేళ ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తమ పార్టీలో చేరడం కలిసొస్తుందని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. ఖానాపూర్ ప్రజలు స్థానికేతరుల కారణంగా చాలాసార్లు మోసపోయిన విషయాన్ని గుర్తు చేసిన ఆమె.. 9ఏండ్లుగా ఎమ్మెల్యేగా కొనసాగుతూ ఎన్నో అభివృద్ధి పనులు చేశానని చెబుతున్నారు. తెలంగాణ ఉద్యమంలో ఎన్నో పోరాటాలు చేసిన తనను నమ్మించి మోసం చేశారని మండిపడుతున్నారు.