Why Krishank : కేటీఆర్ ఆశీస్సులున్నా క్రిశాంక్కు టికెట్ ఎందుకు రాలేదంటే..?
X
అసెంబ్లీ ఎన్నికలకు మరో నాలుగు నెలల సమయం మాత్రమే ఉండటంతో బీఆర్ఎస్ జోరు పెంచింది. ఎలక్షన్ నోటిఫికేషన్ రాకముందే 115 స్థానాలకు అభ్యర్థుల్ని ప్రకటించింది. ఏడుగురు సిట్టింగ్ లను పక్కన పెట్టిన కేసీఆర్.. కొత్త వారికి అవకాశమిచ్చారు. ఈ క్రమంలోనే కంటోన్మెంట్ టికెట్ కేటాయింపు అంశం హాట్ టాపిక్గా మారింది. నిజానికి ఎమ్మెల్యే సాయన్న హఠాన్మరణంతో ఆ టికెట్ ఎవరికి ఇస్తారన్న దానిపై బీఆర్ఎస్ వర్గాల్లో కొంతకాలంగా జోరుగా చర్చ నడుస్తోంది. యువనేత, కేటీఆర్ అండదండలున్న మన్నె క్రిశాంక్కు కంటోన్మెంట్ టికెట్ ఖాయమన్న ఊహాగానాలు వినిపించాయి. అయితే వాటిని పటాపంచలు చేస్తూ సీఎం కేసీఆర్ ఆ స్థానం నుంచి సాయన్న కుమార్తె లాస్య నందితను బరిలో నిలుపుతున్నట్లు ప్రకటించారు. కేటీఆర్ ఆశీస్సున్న క్రిశాంక్కు కాదని లాస్య నందితకు టికెట్ ఇవ్వడంపై ప్రస్తుతం పార్టీతో పాటు మీడియాలోనూ జోరుగా చర్చ నడుస్తోంది.
కేటీఆర్ అండతో
బీఆర్ఎస్ సోషల్ మీడియా ఇంఛార్జ్గా మన్నె క్రిశాంక్ చాలా యాక్టివ్గా ఉంటారు. అంతే కాదు ఇంగ్లీష్, హిందీ ఛానెల్స్లో జాతీయ స్థాయిలో బీఆర్ఎస్ వాయిస్ బలంగా వినిపిస్తాడు. ఈ కారణంతోనే క్రిశాంక్ మంత్రి కేటీఆర్కు దగ్గరయ్యాడు. దీంతో తనకు ఈసారి కంటోన్మెంట్ టికెట్ పక్కా అనుకున్నాడు. కేటీఆర్ ఆఫ్ ది రికార్డ్ సైతం ఇదే మాట చెప్పడంతో క్రిశాంక్ మరింత యాక్టివ్ అయ్యాడు. కంటోన్మెంట్ రోడ్లు తెరిపించే అంశంతో పాటు స్థానిక సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టారు. ప్రజలతో మమేకమయ్యారు. బస్తీ నిద్రలు, యూత్తో ఇంటరాక్ట్ అవుతూ పలు కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. అయితే చివరి నిమిషంలో ఆయన ఆశలు ఆవిరయ్యాయి.
ఇద్దరు నేతల మంత్రాంగం
క్రిశాంక్కు టికెట్ రాకపోవడం వెనుక ఇద్దరు కీలక నేతలు పావులు కదిపినట్లు తెలుస్తోంది. సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్, సికింద్రాబాద్ నియోజకవర్గ ఎమ్మెల్యే పద్మారావు గౌడ్ సాయన్న కూతురికి టికెట్ ఇచ్చేలా కేసీఆర్ను ఒప్పించినట్లు సమాచారం. సాయన్నతో మంచి అనుబంధమున్న తలసాని, పద్మారావు ఆయన హఠాత్మరణంతో ఆ కుటుంబానికి అండగా నిలిచారు. సాయన్నకు ముగ్గురు ఆడపిల్లలున్నారు. వారంతా అవివాహితులే. ఆయన చనిపోయిన తర్వాత తలసాని, పద్మారావులు ఎప్పటికప్పుడు వారి యోగక్షేమాలు కనుక్కుంటున్నారు. పద్మారావు గౌడ్ ఇటీవల బోనాల పండుగకు తన బిడ్డలతో పాటు సాయన్న కూతుళ్లను ఇంటికి పిలిచి పండుగ జరుపుకున్నాడు. అటు తలసాని సైతం లాస్య నందితకు భరోసా ఇస్తూనే ఉన్నారు.
కేసీఆర్ను ఒప్పించి
ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచినప్పటికీ సాయన్న ఆర్థికంగా నిలదొక్కుకోలేదు. కుటుంబ ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే. టీడీపీలో ఉన్నప్పటి నుంచి తలసాని, పద్మారావు గౌడ్కు సాయన్నతో సుదీర్ఘ అనుబంధం ఉంది. మరోవైపు నియోజకవర్గ ప్రజల్లో సాయన్నపై ఎనలేని అభిమానం, ఆయన మరణంతో వచ్చిన సానుభూతి వెల్లువెత్తింది. ఈ అంశాలన్నింటినీ సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లిన ఇద్దరు నేతలు లాస్య నందితకు కంటోన్మెంట్ టికెట్ ఇచ్చేలా కేసీఆర్ను ఒప్పించినట్లు తెలుస్తోంది.
టికెట్ వస్తుందన్న భరోసా
సాయన్న కుమార్తె కంటోన్మెంట్ ప్రస్తుత బీఆర్ఎస్ అభ్యర్థి లాస్య నందిత సైతం టికెట్ తనకే వస్తుందన్న నమ్మకంతో ఉన్నట్లు తెలుస్తోంది. పరామర్శ సమయంలో కేసీఆర్ చూపించిన ప్రేమ, ఆప్యాయత సాయన్న కుటుంబానికి భరోసా కల్పించాయి. స్వతహాగా ఆడపిల్లల విషయంలో ఎక్కువ కేర్ తీసుకునే కేసీఆర్కు లాస్య నందిత విషయంలోనూ సాఫ్ట్ కార్నర్ ఏర్పడింది. చిన్న వయసు, తండ్రి లేని పిల్లలు కావడం, మరోవైపు తలసాని, పద్మారావు గౌడ్లు చేసిన ప్రయత్నాలు నందిత గెలుపు బాధ్యతను వారిద్దరూ భుజాన వేసుకోవడం ఆమెకు టికెట్ దక్కేలా చేశాయి. ఈ క్రమంలోనే టికెట్పై ఆశపెట్టుకుని భంగపడ్డ క్రిశాంక్కు సీఎం కేసీఆర్ స్వయంగా నచ్చజెప్పినట్లు సమాచారం.
క్రిశాంక్ వ్యవహారశైలి
ఇదిలా ఉంటే క్రిశాంక్ వ్యవహారశైలి కూడా ఆయనకు టికెట్ రాకుండా అడ్డుకునేలా చేసిందన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన తలసాని శ్రీనివాస్ యాదవ్, పద్మారావు గౌడ్లను ఆయన లెక్క చేయలేదన్న విమర్శలు ఉన్నాయి. మంత్రి కేటీఆర్ అండదండలున్నాయన్న కారణంతో గల్లీ స్థాయి నుంచి ఎదిగిన లీడర్లైన ఆ ఇద్దరు నేతలను క్రిశాంక్ ఖాతరు చేయకపోవడం అతని టికెట్ కు ఎసరు పెట్టిందని బీఆర్ఎస్ వర్గాల్లో టాక్ నడుస్తోంది. క్రిశాంత్ పద్దతి నచ్చని ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు సాయన్న హఠాన్మరణంతో అందివచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకున్నట్లు తెలుస్తోంది. సాయన్నపై అభిమానం, సానూభూతి వెరిసి క్రిశాంక్కు టికెట్ రాకుండా అడ్డుకున్నారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి.