వద్దిరాజు రవిచంద్ర ఏకగ్రీవం.. కాంగ్రెస్ నుంచి ఆ ఇద్దరు
X
రాజ్యసభ ఎన్నికలకు నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసింది. మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్లను విత్ డ్రా చేసుకునే అవకాశం ఉండగా.. పలువురు నేతలు విత్ డ్రా చేసుకున్నారు. తెలంగాణలో రాజ్యసభ ఎన్నికలు ఏకగ్రీవం అయ్యారు. తెలంగాణలో మూడు స్థానాలకు రాజ్యసభ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ మూడింటిలో రెండు కాంగ్రెస్, ఒకటి బీఆర్ఎస్ కైవసం చేసుకోనుంది. అయితే ఈ మూడు స్థానాలకు 3 నామినేషన్లే వచ్చాయి. కాంగ్రెస్ నుంచి రేణుకా చౌదరీ, అనిల్ కుమార్ యాదవ్, బీఆర్ఎస్ నుంచి వద్దిరాజు రవిచంద్ర నామినేషన్లు దాఖలు చేశారు. నామినేషన్ల విత్ డ్రా తర్వాత ఈ ముగ్గురు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు రిటర్నర్ ఆఫీసర్ ప్రకటించారు.
కాగా మొత్తం 15 రాష్ట్రాల్లో 56 స్థానాలకు రాజ్యసభ ఎన్నికలు జరగుతున్నాయి. ఫిబ్రవరి 27న పోలింగ్ జరగనుండగా.. అదే రోజు ఫలితాలు వెలువడతాయి. తెలంగాణలో 3, ఏపీలో 3 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. తెలంగాణలో వద్దిరాజు రవిచంద్ర, బడుగుల లింగయ్య యాదవ్, సంతోష్ కుమార్, ఏపీలో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, సీఎం రమేష్, కనకమేడల రవీంద్ర కుమార్ల పదవీకాలం ముగియనుడంతో ఈసీ ఎన్నికలు నిర్వహిస్తోంది. ఏపీలో మూడు స్థానాలను వైసీపీ కైవసం చేసుకోనుంది. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ రాజస్థాన్ నుంచి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆమెతో పాటు బీజేపీ నేతలు చున్నిలాల్ గరాసియా, మదన్ రాథోడ్ కూడా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.