రైతుబంధు పథకంపై రిటైర్డ్ ఐఏఎస్ సంచలన వ్యాఖ్యలు
X
తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న రైతుబంధు పథకంపై రిటైర్డ్ ఐఏఎస్ ఆకునూరి మురళి సంచలన వ్యాఖ్యలు చేశారు. రైతు బంధు అసలు రైతులకు అందడం లేదు కానీ హీరో నాగార్జున లాంటి సినిమా హీరోలకు, ఇస్తున్నారని ఆరోపించారు. దుక్కి దున్నే కౌలు రైతులకు కాకుండా.. దొరలకు, ధనవంతులకు, రాజకీయ నాయకులకు, సినీ నటులకు, ఐఏఎస్ ఆఫీసర్లకు, ఆఖరికి ఎన్నారైలకు కూడా రైతుబంధు ఇస్తున్నారని విమర్శించారు. కౌలు రైతులను సీఎం కేసీఆర్ రైతులుగా చూడడం లేదని మండిపడ్డారు. తెలంగాణలో ఇప్పటిదాకా 7 వేల మందికిపైగా రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
తెలంగాణలో పంటబీమా లేకపోవడం దారుణమని ఆకునూరి మురళి అన్నారు. కనీసం కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజనను అయినా రాష్ట్రంలో అమలు చేయలని డిమాండ్ చేశారు. దళారీ చేతిలో రైతులు మోస పోకుండా ఉండేందుకు కనీస మద్దతు ధర ప్రకటించాలని కోరారు. రైతు పండించిన పంటను కనీసం స్టోరేజ్ చేసుకోవడం కోసం గిడ్డంగులు.. గోదాములు ఏర్పాటు చేయాలని చెప్పారు.వ్యవసాయ కమిషన్ ఏర్పాటు చేయాలని ఆకునూరి మురళి సూచించారు.