ప్రజలారా మీరందరూ రండి.. రేవంత్ ఆహ్వానం
X
తెలంగాణ ముఖ్యమంత్రి పీఠం అధిష్టంచనున్న ఎనుముల రేవంత్ రెడ్డి తన ప్రమాణ స్వీకారానికి రావాలని రాష్ట్ర ప్రజలను ఆహ్వానించారు. హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో గురువారం మధ్యాహ్నం 1.04 గంటలకు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఆయనతో ప్రమాణం చేయించునున్నారు. పోలీసులు గట్టి భద్రతా చర్యలు చేపట్టి స్టేడియం చుట్టుపక్కల ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.
తన ప్రమాణానికి ప్రజలను ఆహ్వానిస్తూ రేవంత్ ఓ ప్రకటన విడుదల చేశారు. ‘‘‘తెలంగాణ ప్రజలకు అభినందనలు. విద్యార్థుల పోరాటం, అమరుల త్యాగం, సోనియాగాంధీ ఉక్కు సంకల్పంతో ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో మనందరి ఆకాంక్షలు నెరవేర్చే ఇందిరమ్మ రాజ్య స్థాపనకు సమయం ఆసన్నమైంది. రాష్ట్రంలో ప్రజాస్వామ్య, పారదర్శక పాలన అందించేందుకు.. బలహీనవర్గాలు, దళిత, గిరిజన, మైనారిటీ, రైతు, మహిళ, యువత సంక్షేమ ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు.. మీ అందరి ఆశీస్సులతో డిసెంబరు 7న ప్రమాణస్వీకారం చేయబోతున్నా. ఈ మహోత్సవానికి రావాల్సిందిగా మీ అందరికీ ఇదే ఆహ్వానం’’ అని కోరారు. ప్రమాణ స్వీకారానికి రావాలని కాంగ్రెస్ అధిష్టానాన్ని ఆహ్వానించడానికి ఢిల్లీ వెళ్లిన రేవంత్ ఈ రాత్రికి హైదరాబాద్ చేరుకుంటారు.