డిసెంబర్ 9 నుంచి యువత జీవితాల్లో వెలుగులు
X
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. నిరుద్యోగ యువత భావోద్వేగంతో ప్రాణాలు తీసుకోవద్దని కోరారు. ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన ఆయన.. రెండు నెలలు ఓపిక పట్టాలని యువతను అభ్యర్థించారు. కేసీఆర్ సర్కారు నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడుతోందని రేవంత్ మండిపడ్డారు. డిసెంబరు 9 నుంచి యువత జీవితాల్లో వెలుగులు తెస్తామని భరోసా ఇచ్చారు.
నిరుద్యోగ యువతీయువకులు ఆత్మహత్యలు చేసుకోకూడంటే కేసీఆర్ గద్దె దిగాలని రేవంత్ అన్నారు. 32 లక్షల మంది యువత ఆందోళనలో ఉన్నారని చెప్పారు. జిరాక్స్ సెంటర్లలో ప్రశ్నపత్రాలు అమ్మకానికి పెట్టడం ప్రభుత్వ వైఫల్యం కాదా? అని ప్రశ్నించారు. సింగరేణిలో నియామకాల విషయంలోనూ ప్రభుత్వం సరిగా వ్యవహరించలేదు. గ్రూప్-1, గ్రూప్-2 పరీక్షల రద్దుతో అనేకమంది ఆత్మహత్య చేసుకున్నారని అన్నారు.
పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నవిద్యార్థిని శుక్రవారం హైదరాబాద్‌లో ఆత్మహత్య చేసుకుంటే.. ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు మరో విధంగా ప్రచారం చేస్తున్నారని రేవంత్ ఫైర్ అయ్యారు. విద్యార్థిని రాసిన లేఖలోనే ఆత్మహత్యకు కారణం స్పష్టంగా ఉన్నా ఆమెపై అభాండాలు వేస్తున్నారని అన్నారు. విద్యార్థులు, నిరుద్యోగులకు కాంగ్రెస్ అండగా ఉంటుందన్న ఆయన.. అన్ని సమస్యలకు పరిష్కారం కేసీఆర్ గద్దె దిగడమేనని రేవంత్ అభిప్రాయపడ్డారు.